దుబాయ్: ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ చేసిన ఒక వ్యాఖ్య వివాదాన్ని రేపింది. ఇది మహిళలను కించపరిచే విధంగా ఉందని, కోహ్లి క్రికెట్ వ్యవహారాల్లో తనను లాగడం ఏమిటని అతని భార్య అనుష్క శర్మ సూటిగా ప్రశ్నించడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాను ఎలాంటి తప్పుడు మాట మాట్లాడలేదని, కొందరు వక్రీకరించడంతో సమస్య వచ్చిందని దీనిపై గావస్కర్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే పూర్తి వీడియోను చూస్తే ఎలాంటి వివాదం లేని చోట అనుష్క కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తొందరపడినట్లు కనిపించింది.
ఏం జరిగిందంటే...
గురువారం బెంగళూరు, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సునీల్ గావస్కర్ కామెంటేటర్‌గా (హిందీలో) వ్యవహరించారు. కోహ్లి క్రీజ్‌లో ఉన్న సమయంలో సహ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రాతో లీగ్‌కు ముందు ఆటగాళ్ల సాధన గురించి చర్చిస్తూ... ‘ప్రాక్టీస్‌తోనే తన ఆట మెరుగవుతుందనే విషయం కోహ్లికి బాగా తెలుసు. ఎంతో సాధన చేయాలని కూడా అతను కోరుకుంటాడు. లాక్‌డౌన్ సమయంలో కేవలం అనుష్క బౌలింగ్‌లోనే అతను ప్రాక్టీస్ చేయడం మనం వీడియోలో చూశాం. అయితే దాని వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు’ అని గావస్కర్ అన్నారు. లాక్‌డౌన్ సమయంలో కోహ్లి తన బాల్కనీలో అనుష్కతో క్రికెట్ ఆడుతున్న వీడియో అప్పట్లో వైరల్ అయింది. సన్నీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బహుశా సరదాగా ఈ వ్యాఖ్య చేసి ఉంటారు. అయితే సోషల్ మీడియాలో ఎవరో దీనిని తప్పుగా అన్వయించి సోషల్ మీడియాలో పెట్టారు. గావస్కర్ మాటల్లో ‘అశ్లీలత’ వినిపించిందని, మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడారని దీనిపై ప్రచారం జరిగింది.
మీకిది తగునా...
సన్నీ వ్యాఖ్యలపై అనుష్క శర్మ వెంటనే స్పందించడంతో ఇది ముదిరింది. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆమె భారత మాజీ కెప్టెన్‌ను తీవ్రంగా విమర్శించింది. ‘మిస్టర్ గావస్కర్... మీ వ్యాఖ్య అమర్యాదగా ఉంది. అయితే భర్త ఆట గురించి భార్యను తప్పు పడుతున్నట్లుగా ఉన్న ఈ వ్యాఖ్య మీ నుంచి ఎలా వచ్చింది. ఇన్నేళ్లుగా ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి కామెంటరీలో మీరు ఎప్పుడూ మాట్లాడలేదు. నాకు కూడా అలాంటి గౌరవం ఇవ్వాలని మీరు అనుకోలేదా. నా భర్త ప్రదర్శన గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి మీ వద్ద ఇంకా ఎన్నో పదాలు ఉండి ఉంటాయి. నా పేరు తీసుకొస్తేనే ఆ పదాలకు విలువుంటుందా. 2020లో కూడా నా పరిస్థితి మారలేదు. క్రికెట్‌లోకి నన్ను లాగి నాపై వ్యాఖ్యలు చేసే రోజులకు ముగింపు ఎప్పుడు వస్తుంది. జెంటిల్మన్ క్రీడలో దిగ్గజంలాంటి మీరు చేసిన వ్యాఖ్యతో నేను ఎంత బాధ పడ్డానో తెలియాలనే ఇదంతా చెబుతున్నాను’ అని అనుష్క విరుచుకు పడింది.
తప్పు చేయలేదు...
వివాదం ముదరడంతో చివరకు సునీల్ గావస్కర్ స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. తన మాటల్లో అసలు అనుష్కను ఎక్కడా విమర్శించలేదని, అసలు ఆ వ్యాఖ్యలో ‘అశ్లీలత’ ఎక్కడ ఉందని అన్నారు. ‘అసలు నేను ఆమెను ఎక్కడ తప్పు పట్టాను. వీడియోలో ఉన్నదాని గురించి మాట్లాడుతూ కోహ్లికి ఆ మాత్రమే ప్రాక్టీస్ లభించిందని చెప్పాను. లాక్‌డౌన్‌లో సరదాగా టెన్నిస్ బాల్‌తో ఆడుతున్న క్రికెట్ అది. కోహ్లి వైఫల్యానికి ఆమెను ఎక్కడ బాధ్యురాలిని చేశాను. పర్యటనలో క్రికెటర్లతో పాటు వారి భార్యలు ఉండాలని మొదటి నుంచి పోరాడినవాడిని నేను. నేను అసభ్యంగా ఎందుకు మాట్లాడతాను. ఎవరైనా అలా చెబితే నేనేం చేయలేను. అయినా సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడకపోవడం వల్ల ప్రతీ ఆటగాడిలో కాస్త చురుకుదనం తక్కువగా కనిపిస్తోందని చెప్పాను. ధోని, రోహిత్‌లలాగే కోహ్లి గురించి కూడా అదే మాట మాట్లాడాను’ అని భారత మాజీ కెప్టెన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment