
క్రిస్ గేల్ గోల్డెన్ డక్
గయానా: కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా ఆదివారం జమైకా తలవాహ్స్ తో జరిగిన మ్యాచ్ లో గయానా అమెజాన్ వారియర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ విఫలమయ్యాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు. సొహైల్ తన్వీర్ బౌలింగ్ లో ’గోల్డెన్ డక్’గా పెవిలియన్ కు చేరాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన జమైకా 18 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. పావెల్(38) టాప్ స్కోరర్ గా నిలిచాడు. షకీబ్ 25, వాల్టన్ 12 పరుగులు చేశారు. జమైకా ఆటగాళ్లు మొత్తం ముగ్గురు డకౌట్ కాగా, నలుగురు ఒక అంకె స్కోరుకు పరిమితమయ్యారు. గయానా బౌలర్లలో పెర్మాల్ 3, తన్వీర్ 2, ఎమ్రిట్ 2, జంపా 2 వికెట్లు పడగొట్టారు.
101 పరుగుల లక్ష్యాన్ని గయానా టీమ్ 3 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో చేరుకుంది. లిన్ 39, బ్రాంబ్లీ 27, మహ్మద్ 22 పరుగులతో రాణించారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పెర్మాల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నాడు.