గేల్ ఎట్ 600 సిక్సర్స్!
బ్రిస్బేన్: ప్రపంచ క్రికెట్ లో క్రిస్ గేల్ ఒక సముచిత క్రికెటరే కాదు.. విధ్వంసకర ఆటగాడు కూడా. ఆది నుంచి ప్రత్యర్థి బౌలర్ పై పైచేయి సాధించే అరుదైన ఆటగాళ్లలో గేల్ ఒకడు. ప్రస్తుత వెస్టిండీస్ క్రికెట్ లో స్టార్ ఆటగాడు ఎవరైనా ఉంటే అది గేల్ మాత్రమేనని కచ్చితంగా చెప్పొచ్చు. పిచ్ లోకి అడుగుపెట్టాడంటే ఎడాపెడా బంతుల్ని బౌండరీలకు దాటించడం గేల్ కు తెలిసిన విద్య. కాగా, క్రిస్ గేల్ ఓ ఘనతను సొంతం చేసుకున్నాడు. ట్వంటీ 20 లకు అతికినట్లు సరిపోయే గేల్ ఇదే ఫార్మెట్ లో 600 సిక్సర్ల మార్కును చేరాడు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో గేల్ ఈ ఘనతను అందుకున్నాడు. బ్రిస్బేన్ హీట్ తో జరిగిన మ్యాచ్ లో మెల్ బోర్న్ రినీగేడ్స్ తరపున ఆడుతున్న గేల్ రెండు సిక్సర్లు వేసి ట్వంటీ 20 ఫార్మెట్ లో 600 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. తాజాగా 227వ ట్వంటీ 20 ఆడుతున్న గేల్ ఫోర్ల సంఖ్య కూడా 653 కు పెరిగింది. ఈ మ్యాచ్ లో గేల్(23; 16 బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు) దాటిగా ఆడే యత్నం చేసి పెవిలియన్ కు చేరాడు. కాగా, ఇప్పటివరకూ 45 అంతర్జాతీయ ట్వంటీ 20 మ్యాచ్ లు మాత్రమే ఆడిన గేల్ ఖాతాలో 87 సిక్సర్లు ఉన్నాయి.