westendies
-
ఖాజా 'హ్యాట్రిక్' సెంచరీ
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖాజా వరుస శతకాలతో దుమ్ము రేపుతున్నాడు. వెస్టిండీస్ తో ఇక్కడ శనివారం ఆరంభమైన రెండో టెస్టులో ఖాజా(144) భారీ సెంచరీ నమోదు చేశాడు దీంతో అతను హ్యాట్రిక్ శతకాలను సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో ఖాజా రెండు టెస్టులు ఆడి రెండు శతకాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత గాయం కారణంగా జట్టుకు దూరమైన ఖాజా.. స్వదేశంలో విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చి శతకాన్ని సాధించాడు. అయితే ఉస్మాన్ ఖాజా ఖాతాలో చేరిన మూడు టెస్టు సెంచరీలు తొలి ఇన్నింగ్స్ లోనే రావడం మరో విశేషం. 2011లో సిడ్నీలో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన ఖాజా .. అప్పట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతోపాటు గాయాలు పదే పదే వేధించడంతో జట్టులో స్థానం కోల్పోతూ వచ్చాడు. అయితే చాలా కాలం తరువాత ఇటీవల జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన ఖాజా అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఈరోజు ప్రారంభమైన మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ వార్నర్(23) ఆదిలోనే పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. అనంతరం బర్న్స్, ఖాజాల జోడి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను నిలబెట్టింది. ఈ క్రమంలోనే ఖాజా భారీ శతకానికి తోడు బర్న్స్ (128) సెంచరీ చేయడంతో ఆసీస్ తొలి రోజు ఆటముగిసే సమయానికి 90.0ఓవర్లలో 345 పరుగులు చేసి పటిష్టస్థితికి చేరింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(32 బ్యాటింగ్),వోజస్(10) క్రీజ్ లో ఉన్నారు. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ లో ఆసీస్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. -
గేల్ ఎట్ 600 సిక్సర్స్!
బ్రిస్బేన్: ప్రపంచ క్రికెట్ లో క్రిస్ గేల్ ఒక సముచిత క్రికెటరే కాదు.. విధ్వంసకర ఆటగాడు కూడా. ఆది నుంచి ప్రత్యర్థి బౌలర్ పై పైచేయి సాధించే అరుదైన ఆటగాళ్లలో గేల్ ఒకడు. ప్రస్తుత వెస్టిండీస్ క్రికెట్ లో స్టార్ ఆటగాడు ఎవరైనా ఉంటే అది గేల్ మాత్రమేనని కచ్చితంగా చెప్పొచ్చు. పిచ్ లోకి అడుగుపెట్టాడంటే ఎడాపెడా బంతుల్ని బౌండరీలకు దాటించడం గేల్ కు తెలిసిన విద్య. కాగా, క్రిస్ గేల్ ఓ ఘనతను సొంతం చేసుకున్నాడు. ట్వంటీ 20 లకు అతికినట్లు సరిపోయే గేల్ ఇదే ఫార్మెట్ లో 600 సిక్సర్ల మార్కును చేరాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో గేల్ ఈ ఘనతను అందుకున్నాడు. బ్రిస్బేన్ హీట్ తో జరిగిన మ్యాచ్ లో మెల్ బోర్న్ రినీగేడ్స్ తరపున ఆడుతున్న గేల్ రెండు సిక్సర్లు వేసి ట్వంటీ 20 ఫార్మెట్ లో 600 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. తాజాగా 227వ ట్వంటీ 20 ఆడుతున్న గేల్ ఫోర్ల సంఖ్య కూడా 653 కు పెరిగింది. ఈ మ్యాచ్ లో గేల్(23; 16 బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు) దాటిగా ఆడే యత్నం చేసి పెవిలియన్ కు చేరాడు. కాగా, ఇప్పటివరకూ 45 అంతర్జాతీయ ట్వంటీ 20 మ్యాచ్ లు మాత్రమే ఆడిన గేల్ ఖాతాలో 87 సిక్సర్లు ఉన్నాయి. -
అదరగొట్టిన ఆసీస్
హోబార్ట్: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో ఆసీస్ అదరగొట్టింది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ ఎటువంటి పసలేని విండీస్ ను ఓ ఆటాడుకున్న ఆసీస్ ఇన్నింగ్స్ 212 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 207/6 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన విండీస్ 223 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. దీంతో విండీస్ కు ఫాల్ ఆన్ ఆనివార్యమైంది. తొలి ఇన్నింగ్స్ లో కొద్దిగా ఫర్వాలేదనిపించిన విండీస్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పేకమేడలా కుప్పకూలింది. విండీస్ ఆటగాళ్లలో బ్రాత్ వైట్(94) మినహా ఎవరూ రాణించకపోవడంతో 36.3 ఓవర్లలో 148 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్ లో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఘోర ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో పాటిన్సన్ ఐదు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా, హజిల్ వుడ్ కు మూడు, మిచెల్ మార్ష్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన డబుల్ సెంచరీతో అదరగొట్టిన ఆడమ్ వోజస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 583/4 డిక్లేర్ వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 223 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 148 ఆలౌట్ -
ధోనిసేనను ఓడించే సత్తావుంది: విండీస్ కోచ్ గిబ్సన్
బ్రిడ్జ్‌టౌన్ : ధోనిసేనను కంగుతినిపించే సత్తా తమ ఆటగాళ్లకు వుందని వెస్టిండీస్ కోచ్ ఒటిస్ గిబ్సన్ అన్నారు. వచ్చే నెలలో విండీస్ జట్టు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారని... ఈ టూర్లో విండీస్ జట్టు రాణిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ సారి ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరుగుతుంది. గత పర్యటనలో అనుభవలేమి మాకు ప్రతికూలించింది. కానీ ఇప్పుడు ఆ కొరత లేదు. తప్పకుండా చక్కని ప్రదర్శన కనబరుస్తాం’ అని గిబ్సన్ చెప్పారు. భారత పర్యటనలో వెస్టిండీస్ జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ అంతర్జాతీయ టెస్టులకు వీడ్కోలు పలుకుతున్న సిరీస్ ఇది. తొలి టెస్టు నవంబర్ 6 నుంచి 10 వరకు కోల్‌కతాలో జరగనుంది. సచిన్ ఆడనున్న 200వ టెస్టు, సిరీస్‌లో రెండో టెస్టు 14 నుంచి 18 వరకు ముంబైలో జరుగుతుంది.