
అదరగొట్టిన ఆసీస్
హోబార్ట్: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో ఆసీస్ అదరగొట్టింది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ ఎటువంటి పసలేని విండీస్ ను ఓ ఆటాడుకున్న ఆసీస్ ఇన్నింగ్స్ 212 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 207/6 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన విండీస్ 223 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. దీంతో విండీస్ కు ఫాల్ ఆన్ ఆనివార్యమైంది. తొలి ఇన్నింగ్స్ లో కొద్దిగా ఫర్వాలేదనిపించిన విండీస్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పేకమేడలా కుప్పకూలింది.
విండీస్ ఆటగాళ్లలో బ్రాత్ వైట్(94) మినహా ఎవరూ రాణించకపోవడంతో 36.3 ఓవర్లలో 148 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్ లో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఘోర ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో పాటిన్సన్ ఐదు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా, హజిల్ వుడ్ కు మూడు, మిచెల్ మార్ష్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన డబుల్ సెంచరీతో అదరగొట్టిన ఆడమ్ వోజస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 583/4 డిక్లేర్
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 223 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 148 ఆలౌట్