
ఖాజా 'హ్యాట్రిక్' సెంచరీ
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖాజా వరుస శతకాలతో దుమ్ము రేపుతున్నాడు. వెస్టిండీస్ తో ఇక్కడ శనివారం ఆరంభమైన రెండో టెస్టులో ఖాజా(144) భారీ సెంచరీ నమోదు చేశాడు దీంతో అతను హ్యాట్రిక్ శతకాలను సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో ఖాజా రెండు టెస్టులు ఆడి రెండు శతకాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత గాయం కారణంగా జట్టుకు దూరమైన ఖాజా.. స్వదేశంలో విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చి శతకాన్ని సాధించాడు. అయితే ఉస్మాన్ ఖాజా ఖాతాలో చేరిన మూడు టెస్టు సెంచరీలు తొలి ఇన్నింగ్స్ లోనే రావడం మరో విశేషం. 2011లో సిడ్నీలో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన ఖాజా .. అప్పట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతోపాటు గాయాలు పదే పదే వేధించడంతో జట్టులో స్థానం కోల్పోతూ వచ్చాడు. అయితే చాలా కాలం తరువాత ఇటీవల జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన ఖాజా అంచనాలకు మించి రాణిస్తున్నాడు.
ఇదిలా ఉండగా, ఈరోజు ప్రారంభమైన మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ వార్నర్(23) ఆదిలోనే పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. అనంతరం బర్న్స్, ఖాజాల జోడి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను నిలబెట్టింది. ఈ క్రమంలోనే ఖాజా భారీ శతకానికి తోడు బర్న్స్ (128) సెంచరీ చేయడంతో ఆసీస్ తొలి రోజు ఆటముగిసే సమయానికి 90.0ఓవర్లలో 345 పరుగులు చేసి పటిష్టస్థితికి చేరింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(32 బ్యాటింగ్),వోజస్(10) క్రీజ్ లో ఉన్నారు. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ లో ఆసీస్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.