పూరన్‌ సిక్సర్ల సునామీ.. ఆసీస్‌కు ఝలక్‌ ఇచ్చిన విండీస్‌ | T20 World Cup 2024 Warm-Up Matches: Pooran Shines With Blasting Innings, West Indies Beat Aussies By 35 Runs | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: పూరన్‌ సిక్సర్ల సునామీ.. ఆసీస్‌కు ఝలక్‌ ఇచ్చిన విండీస్‌

Published Fri, May 31 2024 9:22 AM | Last Updated on Fri, May 31 2024 9:29 AM

T20 World Cup 2024 Warm-Up Matches: Pooran Shines With Blasting Innings, West Indies Beat Aussies By 35 Runs

టీ20 వరల్డ్‌కప్‌ 2024 వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఆస్ట్రేలియాకు ఊహించని ఝలక్‌ ఇచ్చింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. 

పూరన్‌ సిక్సర్ల సునామీ
నికోలస్‌ పూరన్‌ ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.‍ కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. పూరన్‌ సిక్సర్ల సునామీ ధాటికి ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌ పార్క్‌ మైదానం తడిసి ముద్దైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో పూరన్‌తో పాటు ప్రతి  ఆటగాడు చెలరేగి ఆడారు. 

తలో చేయి వేశారు..
హోప్‌ 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 14 పరుగులు.. జాన్సన్‌ ఛార్లెస్‌ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. రోవ్‌మన్‌ పావెల్‌ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు.. హెట్‌మైర్‌ 13 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 18 పరుగులు.. రూథర్‌ఫోర్డ్‌ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. విండీస్‌ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఆసీస్‌ బౌలర్లందరూ 10కిపైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. జంపా 2, టిమ్‌ డేవిడ్‌, ఆస్టన్‌ అగర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

పోరాడిన ఆసీస్‌
అనంతరం అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌.. గెలుపు కోసం​ చివరి దాకా పోటీపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లోనూ ప్రతి ఒక్కరూ చెలరేగి ఆడారు. 

వార్నర్‌ 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 15 పరుగులు.. ఆస్టన్‌ అగర్‌ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28.. మార్ష్‌ 4 బంతుల్లో బౌండరీ సాయంతో 4 పరుగులు.. ఇంగ్లిస్‌ 30 బంతుల్లో 5 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు.. టిమ్‌ డేవిడ్‌ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు.. వేడ్‌ 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 25 పరుగులు.. నాథన్‌ ఇల్లిస్‌ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39.. జంపా 16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 21.. హాజిల్‌వుడ్‌ 3 బంతుల్లో 3 పరుగులు చేశారు. 

మ్యాచ్‌ గెలిచేందుకు ఆసీస్‌కు ఈ మెరుపులు సరిపోలేదు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌, మోటీ చెరో 2 వికెట్లు.. అకీల్‌ హొసేన్‌, షమార్‌ జోసఫ్‌, ఓబెద్‌ మెక్‌కాయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో కూడా ఆసీస్‌ తొలి వార్మప్‌ మ్యాచ్‌లోలా తొమ్మిది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. ఆసీస్‌ రెగ్యులర్‌ జట్టు సభ్యులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement