
ఆసీస్ (Australia) వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (Usman Khawaja) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో 35 ఏళ్ల తర్వాత 3000 పరుగులు సాధించిన తొలి ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ క్రికెట్ చరిత్రలో 35 అంతకుమించిన వయసులో ఎవరూ 3000 పరుగుల మార్కును తాకలేదు. ఖ్వాజాకు ముందు స్టీవ్ వా 2554 పరుగులు (53.30 సగటున) చేశాడు.
35 అంతకంటే ఎక్కువ వయసులో ఆసీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..
- ఉస్మాన్ ఖ్వాజా-3016 (51.11)
- స్టీవ్ వా-2554 (53.30)
- అలెన్ బోర్డర్-2473 (42.63)
- మైక్ హస్సీ-2323 (50.50)
- క్రిస్ రోజర్స్-1996 (44.35)
- డాన్ బ్రాడ్‌మన్-1903 (105.72)
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా ఖ్వాజా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఖ్వాజా 36 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు.
రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన అనంతరం లయోన్ ఎవరికీ సాధ్యంకాని ఓ ఘనతను సాధించాడు. ఆసియా గడ్డపై టెస్ట్‌ల్లో 150 వికెట్లు తీసిన నాన్ ఏషియన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
శ్రీలంక ఆలౌటైన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 43 ఓవర్ల అనంతరం 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (36), ట్రవిస్ హెడ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేసి ఔట్ కాగా.. లబూషేన్ నాలుగు పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.
తొలి టెస్ట్‌లో సెంచరీతో కదంతొక్కిన స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌లోనూ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. స్మిత్ 69 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అలెక్స్ క్యారీ (39) క్రీజ్‌లో ఉన్నాడు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2 వికెట్లు పడగొట్టగా.. ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నాడు.
తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ
ఉస్మాన్ ఖ్వాజా తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీతో (232) కదంతొక్కాడు. తద్వారా ఆసీస్ తరఫున డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అత్యంత లేటు వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఖ్వాజా 38 ఏళ్ల 43 రోజుల వయసులో తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్‌లో ఖ్వాజా డబుల్ సెంచరీ.. స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ సెంచరీలతో మెరవడంతో ఆస్ట్రేలియా శ్రీలంకపై భారీ విజయం సాధించింది.