
ఆస్ట్రేలియా తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) టెస్ట్‌ల్లో 36వ శతకాన్ని నమోదు చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ శతకాన్ని స్మిత్ 191 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో పూర్తి చేశాడు. స్మిత్ సెంచరీ మార్కును బౌండరీతో చేరుకున్నాడు. లంక పర్యటనలో స్మిత్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనూ స్మిత్ శతక్కొట్టాడు.
THE MAN, THE MYTH, THE LEGEND - ITS STEVE SMITH IN TEST CRICKET 🦁 pic.twitter.com/phZ6XlCX9T
— Johns. (@CricCrazyJohns) February 7, 2025
తాజా సెంచరీతో స్మిత్ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) రికార్డును సమం చేశాడు. రూట్, స్మిత్ టెస్ట్‌ల్లో తలో 36 సెంచరీలు చేశారు. ఫాబ్ ఫోర్‌గా పిలువబడే వారిలో ప్రస్తుతం స్మిత్, రూట్ అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. కేన్ విలియమ్సన్ (Kane Williamson) 33, విరాట్ కోహ్లి (Virat Kohli) 30 సెంచరీలతో స్మిత్, రూట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. స్మిత్, రోహిత్ శర్మ తలో 48 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ (81 సెంచరీలు) టాప్‌లో ఉండగా.. రూట్ (52) రెండు, కేన్ విలియమ్సన్ (46) నాలుగో స్థానంలో ఉన్నారు.
తాజా సెంచరీ స్మిత్‌కు టెస్ట్ కెప్టెన్‌గా 17వ సెంచరీ. ఈ సెంచరీ స్మిత్‌కు ఆసియాలో 7, శ్రీలంకలో 4వది. ఈ సెంచరీతో స్మిత్ ఆసియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరించాడు. ఆసియాలో అలెన్ బోర్డర్ 6, రికీ పాంటింగ్ 5 సెంచరీలు చేశారు.
ఈ సెంచరీతో స్మిత్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్, రూట్‌తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది. సచిన్ తర్వాతి స్థానాల్లో జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) ఉన్నారు.
టెస్ట్‌ల్లో స్మిత్ సెంచరీలు..
ఆస్ట్రేలియాలో 18
ఇంగ్లండ్‌లో 8
శ్రీలంకలో 4
భారత్‌లో 3
న్యూజిలాండ్‌లో 1
సౌతాఫ్రికాలో 1
వెస్టిండీస్‌లో 1
మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టెస్ట్‌లో స్మిత్ శతక్కొట్టడంతో ఆసీస్ ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆసీస్ 10 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. 68 ఓవర్ల అనంతరం ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. స్మిత్‌కు జతగా క్రీజ్‌లో ఉన్న అలెక్స్ క్యారీ (92) కూడా శతకానికి చేరువయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment