ఆస్ట్రేలియాను చిత్తు చేసిన శ్రీలంక.. | Sri Lanka beat Australia by 49 runs | Sakshi
Sakshi News home page

AUS vs SL 1st Odi: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన శ్రీలంక..

Published Wed, Feb 12 2025 5:32 PM | Last Updated on Wed, Feb 12 2025 7:16 PM

Sri Lanka beat Australia by 49 runs

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 సన్నాహకాలను ఘనంగా ఆరంభించాలని భావించిన ఆస్ట్రేలియాకు శ్రీలంక ఊహించని షాకిచ్చింది.  కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 49 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించారు. 215 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్‌ 33.5 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది.

లంక స్పిన్నర్ల దాటికి ఆసీస్‌ బ్యాటర్లు విల్లవిల్లాడారు. స్టీవ్‌​ స్మిత్‌, లబుషేన్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు సైతం ప్రత్యర్ధి స్పిన్నర్ల ముందు తేలిపోయారు. వచ్చిన వారు వచ్చినట్టగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. శ్రీలంక బౌలర్లలో మహేష్‌ థీక్షణ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దునిత్ వెల్లలాగే, అసితా ఫెర్నాండో తలా రెండు వికెట్లు సాధించారు. 

వీరిద్దరితో పాటు కెప్టెన్‌ అసలంక, హసరంగా చెరో వికెట్‌ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో అలెక్స్‌ క్యారీ(41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హార్దీ(32), సీన్‌ అబాట్‌(20) పర్వాలేదన్పించారు. కమ్మిన్స్‌, స్టార్క్‌, మాక్స్‌వెల్‌ వంటి స్టార్‌ ప్లేయర్లు లేని లోటు ఈ మ్యాచ్‌లో కన్పించింది.

అసలంక విరోచిత సెంచరీ..
అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 46 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. అయితే లంక కెప్టెన్‌ చరిత్‌ అసలంక మాత్రం విరోచిత పోరాటం కనబరిచాడు. సహచరులందరూ విఫలమైన చోట అసలంక అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 126 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో అసలంక 127 పరుగులు చేశాడు. అతడితో పాటు దునిత్ వెల్లలాగే(30) కీలక పరుగులు సాధించారు.

మిగతా ఆటగాళ్లంతా తీవ్ర నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్‌ అబాట్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్‌ ఈల్లీస్‌, జాన్సన్‌, హార్దే తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఫిబ్రవరి 14న ఇదే వేదికలో జరగనుంది. కాగా ఇంతకుముందు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆసీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే.

 రెండో వన్డే అనంతరం ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు ఆస్ట్రేలియా పయనం కానుంది. అయితే ఈ మెగా టోర్నీకి ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌​ పాటు జోష్‌ హాజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్ష్‌ వంటి స్టార్‌ ప్లేయర్లు గాయం కారణంగా దూరమయ్యాడు. తాజాగా ఈ ఈవెంట్‌ కోసం అప్‌డేటడ్‌ జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్‌, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ]
చదవండి: వారెవ్వా!.. శుబ్‌మన్‌ గిల్‌ ప్రపంచ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement