విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో)
లండన్ : తమ గడ్డమీద టెస్ట్ సిరీస్‌లో ఘోర వైఫల్యం చెందుతోన్న భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ తీవ్ర విమర్శలు చేశాడు. చెత్త ఆట ఆడినందుకు విరాట్ కోహ్లి సేన అవమానాల్ని ఎదుర్కోవడంలో తప్పు లేదన్నాడు. 5 టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
డైలీ టెలీగ్రాఫ్‌కు రాసిన కాలమ్‌లో పలు విషయాలు ప్రస్తావించాడు బాయ్‌కాట్. ‘భారత జట్టు ఇంగ్లండ్‌కు ఎంతో ఆత్మవిశ్వాసంతో పాటు అహంకారంతోనూ వచ్చింది. భారత్‌లో ఆడినట్లే ఇక్కడ ఆడితే చాలని భావించడం వల్లే వారి వైఫల్యాలు కొనసాగుతున్నాయి. వారి ఆటతీరుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. ఔట్ స్వింగర్ బంతులను వెంటాడి ఆడి భారత బ్యాట్స్‌మెన్ తమ వికెట్లు అప్పగించారు. బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమవ్వడం వల్లే భారత జట్టుకు పరాభవాలు తప్పడం లేదు. కఠోర శ్రమతో ఆటలో సత్ఫలితాలు రాబట్టవచ్చు. కానీ కోహ్లిసేన ఆ పని చేయడం లేదు. వారి ఆత్మవిశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతోందని’ బాయ్‌కాట్ అభిప్రాయపడ్డాడు. (కసాయి వాడి దగ్గర గొర్రెల్లా టీమిండియా!)
కాగా, తొలి టెస్టులో కెప్టెన్ కోహ్లి కీలక ఇన్నింగ్స్‌లతో కేవలం 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన టీమిండియా.. లార్డ్స్ టెస్టులోనైతే దారుణంగా ఇన్నింగ్స్, 159 పరుగుల తేడాతో ప్రత్యర్థి ఇంగ్లండ్‌కు మ్యాచ్‌ను అప్పగించేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ భారత క్రికెటర్ల ఆటతీరును ఎండగట్టారు. 2014లోనూ ఇంగ్లండ్‌లో టీమిండియా దారుణ వైఫల్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment