Geoffrey Boycott
-
క్రికెట్ దిగ్గజం పరిస్థితి విషమం
గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ, ఇటీవలే సర్జరీ చేయించుకున్న క్రికెట్ దిగ్గజం, ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ జెఫ్రీ బాయ్‌కాట్ (83) మరోసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. న్యుమోనియా కారణంగా జెఫ్రీ ఆరోగ్యం విషమంగా మారినట్లు జెఫ్రీ కుమార్తె ఎమ్మా తెలిపారు. జెఫ్రీ 2002లో తొలిసారి క్యాన్సర్ బారినపడ్డారు. కీమో థెరపీ అనంతరం కోలుకున్నారు. అయితే, ఈ ఏడాది మేలో క్యాన్సర్ తిరగబెట్టడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు.తాజాగా, జెఫ్రీ ఆరోగ్యం విషమించిందని ఆయన కుమార్తె ఎమ్మా ఎక్స్ ద్వారా వెల్లడించారు. తన తండ్రి కోలుకోవాలని కోరుకుంటున్న వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన అభిమానులను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. న్యూమోనియా కారణంగా జెఫ్రీ అన్నపానియాలు తీసుకోలేకపోతున్నారని అన్నారు. ప్రస్తుతం జెఫ్రీ వెంటిలేటర్ పై ఉన్నారని, ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు.జెఫ్రీ 1964-1982 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 108 టెస్ట్‌లు, 36 వన్డేలు ఆడారు. ఇందులో 23 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీల సాయంతో తొమ్మిది వేల పైచిలుకు పరుగులు చేశారు. కెరీర్లో 609 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జెఫ్రీ.. 151 సెంచరీలు, 238 హాఫ్ సెంచరీల సాయంతో 48426 పరుగులు చేశాడు. అలాగే 313 లిస్ట్-ఏ గేమ్స్‌లో 8 సెంచరీలు, 74 అర్దసెంచరీల సాయంతో 10095 పరుగులు చేశాడు. -
బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదం.. వాళ్లు మనుషులైతే బహిరంగా క్షమాపణ చెప్పాలి..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు సర్ జెఫ్రీ బాయ్‌కాట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆసీస్ ఆటగాళ్లు నిజంగా మనుషులైతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసీస్, ఇంగ్లండ్ జట్లు అద్భుతమైన క్రికెట్ ఆడాయి.. ఇలాంటి ఘటనలు ఆట స్ఫూర్తికి మంచిది కాదని అన్నారు. అందరం తప్పులు చేస్తాం.. బెయిర్‌స్టో విషయంలో ఆసీస్ కూడా తప్పు చేసింది.. ఈ విషయంలో వారు తమ తప్పును అంగీకరించాలని కోరారు. ఏ పద్దతిలోనైనా గెలవాలనుకునే వారికి క్రికెట్ సరైన ఆట కాదని, ఇలాంటి (బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్) ఘటనలు జెంటిల్మెన్ గేమ్ ప్రతిష్టను మసకబారుస్తాయని తెలిపాడు. గెలవడం కోసం కష్టపడటం మంచిదే, కానీ క్రీడా స్పూర్తిని మరిచి గెలవాలనుకోవడం మాత్రం సరైంది కాదని హితవు పలికాడు. ఓ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానికి క్రికెట్ చట్టాలను ఆపాదించడం కరెక్ట్ కాదని, ఇలాంటి సందర్భాల్లో ప్రత్యర్ధి జట్లు ఇంగితజ్ఞానం ఉపయోగిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. కాగా, రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో బెయిర్‌స్టో చేసిన అనాలోచిత పని (బంతి వికెట్ కీపర్ చేతిలో ఉండగానే క్రీజ్ వదిలి బయటికి రావడం) ఇంత వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. బెయిర్‌స్టో నిర్లక్ష్యం కారణంగా ఇంగ్లండ్ మ్యాచ్‌ను కోల్పోవడంతో పాటు ఈ విషయాన్ని పెద్దది చేసినందుకు నవ్వులపాలైంది. బెన్ స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఫలితంగా ఆసీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
బెయిర్‌స్టో ఆడటం అతనికి ఇష్టం లేదు.. అందుకే..!
లండన్: భారత్‌తో రేపటి నుంచి ప్రారంభం కానున్నరెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ తుది జట్టులో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో ఆడటం ఇంగ్లండ్ ఛీఫ్ సెలెక్టర్ ఎడ్ స్మిత్‌కు ఇష్టం లేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయకాట్ ఆరోపించాడు. భారత పర్యటనకు ముందు శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో బెయిర్‌స్టో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసినప్పటికీ.. విశ్రాంతి పేరుతో అతన్ని ఇంటికి పంపించి, ఇప్పుడు తుది జట్టులో ఆడే అవకాశం ఉన్నా అతనికి బదులు మరో వికెట్ కీపర్(బెన్ ఫోక్స్)వైపు మొగ్గు చూపడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు. ప్రతిభ గల ఆటగాడి పట్ల జట్టు యాజమాన్యం ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కాగా, భారత్‌తో రెండో టెస్ట్‌కు జోస్ బట్లర్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో బెన్ ఫోక్స్‌ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఇంగ్లండ్ జట్టులో ఇటీవల కాలంలో రోటేషన్ పద్దతి పేరుతో ఆటగాళ్లను అకారణంగా పక్కకు పెడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లీష్ జట్టు ఈ మ్యాచ్‌లో నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. అండర్సన్, ఆర్చర్, బట్లర్, బెస్ల స్థానంలో వోక్స్, బ్రాడ్, ఫోక్స్, మొయిన్ అలీలతో బరిలోకి దిగుతుంది. భారత్ నదీమ్‌కు బదులు అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 9:30గంటలకు ప్రారంభం కానుంది. -
'ఇలాగే ఆడితే రికార్డులు బ్రేక్ అవడం ఖాయం'
లండన్: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డ్‌ని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్రేక్ చేస్తాడని మాజీ ఆటగాడు జెఫ్రీ బాయ్‌కాట్ జోస్యం చెప్పాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. సోమవారం ముగిసిన శ్రీలంక టూర్లో జో రూట్ టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇదే జోరుని రూట్ కొనసాగిస్తే సచిన్ రికార్డ్ బ్రేక్ అవడం ఖాయమని బాయ్‌కాట్ చెప్పుకొచ్చాడు. 'ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్ స్థానం మరిచిపోకండి. ఎందుకంటే.. జో రూట్‌కి కనీసం 200 టెస్టులు ఆడే సామర్థ్యం ఉంది. ఒకవేళ అతను అన్ని టెస్టులు ఆడితే కచ్చితంగా సచిన్ అత్యధిక పరుగుల రికార్డ్‌ని బ్రేక్ చేయగలడు. రూట్ వయసు ఇప్పుడు కేవలం 30 ఏళ్లే. ఇప్పటికే 99 టెస్టులాడిన అతని 8,249 పరుగులు చేశాడు. కాబట్టి.. ఇకపై కెరీర్లో ఏదైనా పెద్ద దెబ్బ తగిలితే తప్ప సచిన్ ఆల్‌టైమ్ రికార్డ్‌ని అతను బద్దలు కొట్టలేకపోవడానికి పెద్దగా కారణలేమీ కనిపించడం లేదు'అని బాయ్‌కాట్ వెల్లడించాడు. చదవండి: ధోని దంపతులతో చిల్ అయిన పంత్ గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 228 పరుగులు చేసిన జో రూట్.. రెండో టెస్టులోనూ 186 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 106.50 సగటుతో 426 పరుగులు చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో ఇంగ్లండ్‌ని సిరీస్ విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గానూ రూట్ నిలిచాడు. ఇప్పటి వరకూ 99 టెస్టులాడిన జో రూట్ 49.39 సగటుతో 8,249 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం రూట్ 29వ స్థానంలో కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కెరీర్లో 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు.చదవండి: 'స్మిత్‌ను పంపించాం.. స్టోక్స్‌ను వదులుకోలేం' -
నాకు బాయ్‌కాట్ కోపం తెప్పించారు: సైఫ్ అలీఖాన్
ముంబై: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడి. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అంటే భారత క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన క్రికెటర్. ఆయనకు 'టైగర్ పటౌడి' అనే ముద్దు పేరు కూడా ఉంది. అయితే టైగర్ పటౌడి తన కెరీర్లో ఎక్కువ భాగం ఒక కంటి చూపుతోనే క్రికెట్ ఆడారు. పటౌడి 1961లో ఇంగ్లండ్‌లో కారు ప్రమాదానికి గురికావడంతో ఆయన కుడి కన్ను దెబ్బతింది. అయినా అలాగే క్రికెట్ ఆడి పరుగుల వరద పారించారు. ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక ముద్ర వేశారు. అయితే మన్సూర్ అలీఖాన్ పటౌడీ ఒక కన్ను పని చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. తన తండ్రి టైగర్ పటౌడి కంటి సమస్య గురించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జఫ్రీ బాయ్‌కాట్ చేసిన వ్యాఖ్యల గురించి తాజాగా మాట్లాడిన సైఫ్ అలీఖాన్.. ఆ మాటలు తనకు, తన తండ్రికి కోపం తెప్పించాయని తెలిపారు. (వరల్డ్‌కప్‌లో ఇది స్పెషల్ ఇన్నింగ్స్!) తాజాగా స్పోర్ట్స్ కీడాతో సైఫ్ ముచ్చటిస్తూ.. ‘ ఒకసారి బాయ్‌కాట్ నాతో మాట్లాడుతూ.. మీ నాన్న గారి గురించి విన్నాను. కానీ ఒకే కంటితో టెస్టు క్రికెట్ ఆడటమనేది అసాధ్యం’ అని అన్నాడు. దాంతో నేను మా నాన్న అబద్ధం చెబుతున్నారని, చీటింగ్ చేశారని అనుకుంటున్నారా? అని తిరిగి అడిగితే, అవును.. దాదాపు అలానే అనుకుంటున్నాను అని అన్నారు. దాంతో నాకు విపరీతమైన కోపం వచ్చేసింది’ అని సైఫ్ తెలిపారు. . అదే విషయం మా నాన్నకి చెబితే.. ‘ఆయన కూడా ఆవేశపడ్డారు. రెండు కళ్లతో నాకు బాగా కనపడేది.. ఒక కంటితో కూడా బాగానే కనపడుతోందని నాన్న అన్నారు. ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటో అనేక తెలిస్తే చాలు’ అని నాన్న అన్నారని సైఫ్ పేర్కొన్నాడు. మన్సూర్ అలీఖాన్ పటౌడి 1961 నుంచి 1975 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. 46 టెస్టులు ఆడగా వాటిలో 40 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేశారు. టెస్టుల్లో 34.91 సగటుతో ఆరు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు సాధించారు. పటౌడి సెప్టెంబరు 22, 2011న మరణించారు. భారత్ 1967లో తొలిసారి న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్ గెలిచింది పటౌడీ సారథ్యంలోనే కావడం విశేషం. -
బీబీసీకి బాయ్‌కాట్ గుడ్‌బై
లండన్: బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)తో 14 ఏళ్ల అనుబంధాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ తెంచుకున్నాడు. ‘బీబీసీ టెస్టు మ్యాచ్ ప్రత్యేక కామెంటరీ బృందం’ నుంచి 79 ఏళ్ల బాయ్కాట్తప్పుకున్నాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నా ఆరోగ్యం గురించి వాస్తవికంగా, నిజాయితీగా ఆలోచించాలి. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ఇటీవలే బైపాస్ సర్జరీ కూడా జరిగింది. 79 ఏళ్ల వయస్సులో ఇంకా వ్యాఖ్యాతగా వ్యవహరించడం కష్టమే’ అని బాయ్‌కాట్ తెలిపాడు. -
టీమిండియాపై మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు
లండన్ : తమ గడ్డమీద టెస్ట్ సిరీస్‌లో ఘోర వైఫల్యం చెందుతోన్న భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ తీవ్ర విమర్శలు చేశాడు. చెత్త ఆట ఆడినందుకు విరాట్ కోహ్లి సేన అవమానాల్ని ఎదుర్కోవడంలో తప్పు లేదన్నాడు. 5 టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. డైలీ టెలీగ్రాఫ్‌కు రాసిన కాలమ్‌లో పలు విషయాలు ప్రస్తావించాడు బాయ్‌కాట్. ‘భారత జట్టు ఇంగ్లండ్‌కు ఎంతో ఆత్మవిశ్వాసంతో పాటు అహంకారంతోనూ వచ్చింది. భారత్‌లో ఆడినట్లే ఇక్కడ ఆడితే చాలని భావించడం వల్లే వారి వైఫల్యాలు కొనసాగుతున్నాయి. వారి ఆటతీరుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. ఔట్ స్వింగర్ బంతులను వెంటాడి ఆడి భారత బ్యాట్స్‌మెన్ తమ వికెట్లు అప్పగించారు. బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమవ్వడం వల్లే భారత జట్టుకు పరాభవాలు తప్పడం లేదు. కఠోర శ్రమతో ఆటలో సత్ఫలితాలు రాబట్టవచ్చు. కానీ కోహ్లిసేన ఆ పని చేయడం లేదు. వారి ఆత్మవిశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతోందని’ బాయ్‌కాట్ అభిప్రాయపడ్డాడు. (కసాయి వాడి దగ్గర గొర్రెల్లా టీమిండియా!) కాగా, తొలి టెస్టులో కెప్టెన్ కోహ్లి కీలక ఇన్నింగ్స్‌లతో కేవలం 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన టీమిండియా.. లార్డ్స్ టెస్టులోనైతే దారుణంగా ఇన్నింగ్స్, 159 పరుగుల తేడాతో ప్రత్యర్థి ఇంగ్లండ్‌కు మ్యాచ్‌ను అప్పగించేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ భారత క్రికెటర్ల ఆటతీరును ఎండగట్టారు. 2014లోనూ ఇంగ్లండ్‌లో టీమిండియా దారుణ వైఫల్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
కసాయి వాడి దగ్గర గొర్రెల్లా టీమిండియా!
లండన్: ఇంగ్లండ్ పై ఘోర వైఫల్యం చవిచూసిన భారత్ ను చూస్తే జాలేస్తుందని మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ తెలిపాడు. భారత జట్టు సమిష్టిగా వైఫల్యం చెంది టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించడం మాత్రం నిజంగా చాలా బాధగా ఉందన్నారు. సోమవారం భారత ఆటగాళ్ల ప్రదర్శనపై డైలీ టెలీ గ్రాఫ్ కు రాసిన వ్యాసంలో బాయ్ కాట్ వ్యంగాస్త్రాలు సంధించారు. టీమిండియా బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతోనే దారుణమైన ఓటమిని చవిచూసి సిరీస్ ను కోల్పోయారన్నారు. 'భారత్ ఆటగాళ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అసలు వారు ఆడిన తీరు సరిగా లేదు. బౌలింగ్ అనుకూలించే ఓల్డ్ ట్రాఫర్డ్, ఓవల్ మైదానాల్లో వారు ఘోరంగా దెబ్బతిన్నారు. ఒక కసాయి వాడి దగ్గరికి గొర్రెల మాదిరిగా భారత్ ప్రదర్శన సాగింది' అని బాయ్ కాట్ ఎద్దేవా చేశారు. గత శీతాకాలం ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ లను ఇంగ్లండ్ అభిమానులు జీర్ణించుకోలేకపోయినా.. ఈ సిరీస్ మాత్రం వారిలో అమితమైన ఆనందాన్ని నింపిందని బాయ్ కాట్ స్పష్టం చేశాడు. ఆ సీజన్ లో ఇంగ్లండ్ తొందరగా మ్యాచ్ లను ముగించిన తీరును ఈ సందర్భంగా ప్రస్తావించాడు. -
నిర్జీవమైన పిచ్ లు ఎందుకు?:జెఫ్రీ బాయ్ కాట్
లండన్: ఇంగ్లండ్-భారత్ ల మధ్య జరిగిన తొలిటెస్టు డ్రా ముగియడం విమర్శలకు దారి తీస్తోంది. నిర్జీవమైన పిచ్ లకు ఇకనైనా చెక్ పెట్టాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ స్పష్టం చేశారు. అసలు ఆ తరహా పిచ్ లను రూపొందించడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. స్వదేశాల్లో పిచ్ లను ఈ రకంగా తయారుచేస్తే బౌలర్ లోని నైపుణ్యం వెలికి తీయడం కష్టమని తెలిపారు.' ద డైలీ టెలిగ్రాఫ్' కు రాసిన ఓ కాలమ్ బాయ్ కాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. తొలి టెస్టులో ఇరు జట్లలోని బౌలర్లు పేస్ ను రాబట్టడానికి యత్నించి విఫలమవ్వడానికి పిచ్ లోని నిర్జీవమే ప్రధాన కారణమన్నారు..గత ఏడు టెస్టుల నుంచి ఇదే పరిస్థితిని చవిచూస్తాన్నా.. పిచ్ లను రూపొందించడంలో మార్పులు కనబడటం లేదన్నారు. ఈ రకంగా పిచ్ లను తయారు చేస్తే బౌలర్ల ఆత్మ విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉందన్నారు. బౌలర్లను దృష్టిలో పెట్టుకునే పిచ్ లపై ఉండే ఉపరితలాన్ని గ్రౌండ్స్ మెన్ రూపొందించడం ప్రతీ దేశంలోనూ జరుగుతుందని.. అలా చేయడం ఎంతమాత్రం మోసం కాదని బాయ్ కాట్ తెలిపారు. ఆ తరహా విధానం క్రికెట్ న్యాయసూత్రాలకు ఎటువంటి భంగం కల్గించదన్నారు. అలా కాకుండా నాటింగ్ హమ్ లాంటి పిచ్ లను తయారు చేస్తే మాత్రం కచ్చితంగా బౌలర్లు ప్రతిభ మసకబారిపోవడం ఖాయమన్నారు.