Bairstow Controversial Stumping: Sir Geoffrey Boycott Demands Public Apology From Australia - Sakshi
Sakshi News home page

బెయిర్‌స్టో స్టంపౌట్‌ వివాదం.. వాళ్లు మనుషులైతే బహిరంగా క్షమాపణ చెప్పాలి..!

Published Tue, Jul 4 2023 7:34 AM | Last Updated on Tue, Jul 4 2023 8:47 AM

Bairstow Controversial Stumping: Geoffrey Boycott Demands Australia For Public Apology - Sakshi

యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై ఇంగ్లండ్‌ దిగ్గజ ఆటగాడు సర్‌ జెఫ్రీ బాయ్‌కాట్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆసీస్‌ ఆటగాళ్లు నిజంగా మనుషులైతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ఆసీస్‌, ఇంగ్లండ్‌ జట్లు అద్భుతమైన క్రికెట్ ఆడాయి.. ఇలాంటి ఘటనలు ఆట స్ఫూర్తికి మంచిది కాదని అన్నారు. అందరం తప్పులు చేస్తాం.. బెయిర్‌స్టో విషయంలో ఆసీస్‌ కూడా తప్పు చేసింది.. ఈ విషయంలో వారు తమ తప్పును అంగీకరించాలని కోరారు. 

ఏ పద్దతిలోనైనా గెలవాలనుకునే వారికి క్రికెట్‌ సరైన ఆట కాదని, ఇలాంటి (బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌) ఘటనలు జెంటిల్మెన్‌ గేమ్‌ ప్రతిష్టను మసకబారుస్తాయని తెలిపాడు. 

గెలవడం కోసం కష్టపడటం మంచిదే, కానీ క్రీడా స్పూర్తిని మరిచి గెలవాలనుకోవడం మాత్రం సరైంది కాదని హితవు పలికాడు. ఓ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానికి క్రికెట్‌ చట్టాలను ఆపాదించడం కరెక్ట్‌ కాదని, ఇలాంటి సందర్భాల్లో ప్రత్యర్ధి జట్లు ఇంగితజ్ఞానం ఉపయోగిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. 

కాగా, రెండో టెస్ట్‌ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో బెయిర్‌స్టో చేసిన అనాలోచిత పని (బంతి వికెట్‌ కీపర్‌ చేతిలో ఉండగానే క్రీజ్‌ వదిలి బయటికి రావడం) ఇంత వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. 

బెయిర్‌స్టో నిర్లక్ష్యం కారణంగా ఇంగ్లండ్‌ మ్యాచ్‌ను కోల్పోవడంతో పాటు ఈ విషయాన్ని పెద్దది చేసినందుకు నవ్వులపాలైంది. బెన్‌ స్టోక్స్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ వృధా అయ్యింది. ఫలితంగా ఆసీస్‌ 43 పరుగుల తేడాతో విజయం సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement