లండన్: ఇంగ్లండ్-భారత్ ల మధ్య జరిగిన తొలిటెస్టు డ్రా ముగియడం విమర్శలకు దారి తీస్తోంది. నిర్జీవమైన పిచ్ లకు ఇకనైనా చెక్ పెట్టాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ స్పష్టం చేశారు. అసలు ఆ తరహా పిచ్ లను రూపొందించడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. స్వదేశాల్లో పిచ్ లను ఈ రకంగా తయారుచేస్తే బౌలర్ లోని నైపుణ్యం వెలికి తీయడం కష్టమని తెలిపారు.' ద డైలీ టెలిగ్రాఫ్' కు రాసిన ఓ కాలమ్ బాయ్ కాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. తొలి టెస్టులో ఇరు జట్లలోని బౌలర్లు పేస్ ను రాబట్టడానికి యత్నించి విఫలమవ్వడానికి పిచ్ లోని నిర్జీవమే ప్రధాన కారణమన్నారు..గత ఏడు టెస్టుల నుంచి ఇదే పరిస్థితిని చవిచూస్తాన్నా.. పిచ్ లను రూపొందించడంలో మార్పులు కనబడటం లేదన్నారు. ఈ రకంగా పిచ్ లను తయారు చేస్తే బౌలర్ల ఆత్మ విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
బౌలర్లను దృష్టిలో పెట్టుకునే పిచ్ లపై ఉండే ఉపరితలాన్ని గ్రౌండ్స్ మెన్ రూపొందించడం ప్రతీ దేశంలోనూ జరుగుతుందని.. అలా చేయడం ఎంతమాత్రం మోసం కాదని బాయ్ కాట్ తెలిపారు. ఆ తరహా విధానం క్రికెట్ న్యాయసూత్రాలకు ఎటువంటి భంగం కల్గించదన్నారు. అలా కాకుండా నాటింగ్ హమ్ లాంటి పిచ్ లను తయారు చేస్తే మాత్రం కచ్చితంగా బౌలర్లు ప్రతిభ మసకబారిపోవడం ఖాయమన్నారు.