
ఇక ‘హాంకాంగ్'పై గురి
బరిలో శ్రీకాంత్, సైనా
హాంకాంగ్: చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్స్ నెగ్గి చరిత్ర సృష్టించిన శ్రీకాంత్, సైనా నెహ్వాల్ మరో పరీక్షకు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో ఈ ఇద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో భారత క్రీడాకారులు అజయ్ జయరామ్, సౌరభ్ వర్మ ఉన్నారు.
తొలి రౌండ్‌లో అబ్దుల్ లతీఫ్ (మలేసియా)తో జయరామ్; హువాన్ గావో (చైనా)తో సౌరభ్ తలపడతారు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్; సెన్సోమ్‌బూన్‌సుక్ (థాయ్‌లాండ్)తో కశ్యప్; షో ససాకి (జపాన్)తో గురుసాయిదత్ ఆడతారు. తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే రెండో రౌండ్‌లోనే శ్రీకాంత్, కశ్యప్ పరస్పరం తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో జామీ సుబంధి (అమెరికా)తో సైనా నెహ్వాల్; ఒంగ్‌బుమ్‌రుంగ్‌పన్ (థాయ్‌లాండ్)తో పి.వి.సింధు పోటీపడతారు.