హరికృష్ణకు రజతం
సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: చైనా వేదిక తెలుగు చెస్ క్రీడాకారులకు బాగా కలిసొచ్చినట్టుంది. నాలుగు రోజుల క్రితం చైనాలోని చెంగ్డూలో జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీలో తెలుగు అమ్మాయిలు హారిక, హంపి స్వర్ణ, రజత పతకాలు నెగ్గగా... తాజాగా చైనాలోనే జరిగిన డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మెరిశాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో హరికృష్ణ ఐదు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు.
మహిళల ప్రపంచ చాంపియన్ హు ఇఫాన్ (చైనా)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నెపోమ్‌నియాచి (రష్యా) ఆరు పాయింట్లతో విజేతగా నిలిచాడు. హరికృష్ణ, యు వాంగ్ (చైనా) ఐదు పాయింట్లతో సమఉజ్జీగా నిలి చినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హరికృష్ణకు రెండో స్థానం దక్కింది.