
హెంగ్‌షుయె (చైనా): వరల్డ్ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. 16 మంది మేటి చెస్ క్రీడాకారిణుల మధ్య ర్యాపిడ్ పద్ధతిలో 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం నాలుగు రౌండ్ గేమ్‌లు నిర్వహించారు. నాలుగో రౌండ్ ముగిశాక హంపి రెండు పాయింట్లతో ఆరో స్థానంలో, హారిక రెండు పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నారు. తొలి గేమ్‌లో హంపి 69 ఎత్తుల్లో బేలా ఖొటెనాష్‌విలి (జార్జియా)పై గెలిచింది.
జన్‌సాయా (కజకిస్తాన్)తో రెండో గేమ్‌ను 32 ఎత్తుల్లో... కొస్టెనిక్ (రష్యా)తో మూడో గేమ్‌ను 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో జరిగిన నాలుగో గేమ్‌లో 53 ఎత్తుల్లో ఓడిపోయింది. మరోవైపు హారిక తొలి గేమ్‌లో 95 ఎత్తుల్లో కొస్టెనిక్ (రష్యా) చేతిలో ఓడిపోయి... ఎలిజబెత్ (జర్మనీ)తో జరిగిన రెండో గేమ్‌ను 79 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బేలా (జార్జియా)తో జరిగిన మూడో గేమ్‌లో హారిక 44 ఎత్తుల్లో గెలిచి, అనస్తాసియా (రష్యా)తో జరిగిన నాలుగో గేమ్‌ను 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. హంపి, హారికతోపాటు మరో నలుగురి ఖాతాలోనూ రెండేసి పాయింట్లు ఉన్నా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment