
హామిల్టన్ హ్యాట్రిక్ ‘పోల్’
నేడు చైనా గ్రాండ్‌ప్రి ఉ.గం. 11.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో
షాంఘై: తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుసగా మూడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో డిఫెండింగ్ చాంపియన్ హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.782 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సీజన్‌లోని ఆస్ట్రేలియా, మలేసియా గ్రాండ్‌ప్రి రేసుల్లోనూ హామిల్టన్‌కు ‘పోల్ పొజిషన్’ లభించింది. హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి... వెటెల్ (ఫెరారీ) మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు వరుసగా మూడోసారి ఫైనల్ క్వాలిఫయింగ్ సెషన్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యారు. ఆదివారం జరిగే రేసును ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ 15వ, హుల్కెన్‌బర్గ్ 16వ స్థానాల నుంచి ప్రారంభిస్తారు.