వారెవ్వా... వెటెల్
వారెవ్వా... వెటెల్
Published Mon, Aug 26 2013 2:23 AM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM
స్పా ఫ్రాంకోర్‌చాంప్స్: క్వాలిఫయింగ్ సెషన్స్‌ను ప్రత్యర్థులకు వదిలేస్తున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ప్రధాన రేసుల్లో మాత్రం తన సత్తా నిరూపించుకుంటున్నాడు. వరుసగా నాలుగోసారి ‘పోల్ పొజిషన్’ను లూయిస్ హామిల్టన్‌కు వదిలేసిన ఈ డిఫెండింగ్ ‘హ్యాట్రిక్’ వరల్డ్ చాంపియన్ ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 44 ల్యాప్‌ల రేసును వెటెల్ గంటా 23 నిమిషాల 42.196 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
మరోవైపు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ అలోన్సో రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు పాల్ డి రెస్టా, అడ్రియన్ సుటిల్‌లకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. 5వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన పాల్ డి రెస్టా 26వ ల్యాప్‌లో వైదొలిగాడు. ట్రాక్ మలుపు వద్ద విలియమ్స్ జట్టు డ్రైవర్ మల్డొనాడో కారు రెస్టా కారును ఢీకొట్టింది. సుటిల్ తొమ్మిదో స్థానంలో నిలిచి తన ఖాతాలో రెండు పాయింట్లు వేసుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబరు 8న జరుగుతుంది.
ఈ సీజన్‌లో హామిల్టన్‌కు నాలుగోసారి ‘పోల్ పొజిషన్’ కలిసిరాలేదు. తొలి ల్యాప్‌లోనే హామిల్టన్‌ను వెనక్కినెట్టిన వెటెల్ అటునుంచి వెనుదిరిగి చూడలేదు. ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ ట్రాక్‌పై దూసుకెళ్లి 16 సెకన్ల తేడాతో విజయం సాధించాడు. ఓవరాల్‌గా వెటెల్ కెరీర్‌లో ఇది 31వ టైటిల్ కావడం విశేషం. ‘రేసు అద్భుతంగా సాగింది. హామిల్టన్‌పై మా వ్యూహం ఫలించింది. తొలి ల్యాప్‌లోనే అతణ్ని అధిగమించాను. వర్షం వస్తుందేమోనని కాస్త అందోళన చెందినా అంతా సవ్యంగా సాగిపోయింది’ అని వెటెల్ వ్యాఖ్యానించాడు.
గమ్యం చేరారిలా...
స్థానం డ్రైవర్ జట్టు సమయం పాయింట్లు
1 వెటెల్ రెడ్‌బుల్ 1:23:42.196 25
2 అలోన్సో ఫెరారీ 1:23:59.065 18
3 హామిల్టన్ మెర్సిడెస్ 1:24:09.930 15
4 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 1:24:12.068 12
5 వెబెర్ రెడ్‌బుల్ 1:24:16.041 10
6 బటన్ మెక్‌లారెన్ 1:24:22.990 8
7 మసా ఫెరారీ 1:24:36.118 6
8 గ్రోస్యెన్ లోటస్ 1:24:38.042 4
9 సుటిల్ ఫోర్స్ ఇండియా 1:24:51.743 2
10 రికియార్డో ఎస్టీఆర్ 1:24:55.666 1
నోట్: సమయం గంటలు, నిమిషాలు, సెకన్లలో
డ్రైవర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5)
స్థానం డ్రైవర్ జట్టు పాయింట్లు
1 వెటెల్ రెడ్‌బుల్ 197
2 అలోన్సో ఫెరారీ 151
3 హామిల్టన్ మెర్సిడెస్ 139
4 రైకోనెన్ లోటస్ 134
5 వెబెర్ రెడ్‌బుల్ 115
కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5)
స్థానం జట్టు పాయింట్లు
1 రెడ్‌బుల్ 312
2 మెర్సిడెస్ 235
3 ఫెరారీ 218
4 లోటస్ 187
5 మెక్‌లారెన్ 65
Advertisement
Advertisement