హనీమూన్‌కు వెళ్లడం లేదు: హర్భజన్
నేడు గీతా బాస్రాతో వివాహం
న్యూఢిల్లీ: భారత జట్టు క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మెహందీ, సంగీత్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న స్పిన్నర్.. గురువారం తన స్నేహితురాలు గీతా బాస్రాను వివాహామాడనున్నాడు. జీవితంలో మరో కొత్త ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టానని భజ్జీ అన్నాడు. అయితే పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లడం లేదని చెప్పాడు. ‘నేను దేవుడిని నమ్ముతాను. ఆయన ఆశీస్సులతో నేటి నుంచి నా జీవితంలో కొత్త ఆధ్యాయం ప్రారంభమవుతుంది.
అది కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఇప్పటికైతే హనీమూన్ ప్రణాళికలు లేవు. పెళ్లి తంతు ముగిశాక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో బరిలోకి దిగాలి. పీసీఏ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి’ అని భజ్జీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తన బౌలింగ్ సంతృప్తినిచ్చిందని హర్భజన్ అన్నాడు.
‘తొలి రెండు టెస్టుల్లో చోటు దక్కకపోవడంపై విరాట్‌తో మాట్లాడా. ప్రొటీస్ జట్టులో ముగ్గురు కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ ఉండటంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా కావాలనుకుంటున్నట్లు చెప్పాడు. నిజంగా జట్టు కూర్పు గురించి ఇలా చెప్పడం చాలా బాగా అనిపించింది. అయితే టెస్టుల్లో చోటు కోసం పోరాడుతూనే ఉంటా’ అని హర్భజన్ వివరించాడు.