జ్లాటన్ ఇబ్రహిమోవిచ్ ఇంటర్వూ్య
మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ స్ట్రయికర్ జ్లాటన్ ఇబ్రహిమోవిచ్. స్వీడన్‌కు చెందిన ఈ ఆటగాడు ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో విశేషంగా రాణిస్తున్నాడు. 26 మ్యాచ్‌ల్లో 17 గోల్స్ చేసిన ఇబ్రహిమోవిచ్ వయస్సు 35 అయినా తన దూకుడుకు 20 ఏళ్లే అంటున్నాడు. తన దృష్టిలో వయస్సనేది కేవలం ఒక అంకెననీ... దాని గురించి బెంగే లేదన్నాడు. ఫిట్‌గా ఉంటే తను 50 ఏళ్లయినా ఆడగలనని చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్‌లో 26 మ్యాచ్‌లాడిన మీరు కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోవచ్చుగా?
నాకెందుకు విశ్రాంతి. నేనొచ్చిందే ఆడేందుకు. నేనిప్పటికీ 20 ఏళ్ల కుర్రాడిలా తాజాగా మైదానంలోకి దిగుతున్నాను. ఈ ఫిట్‌నెస్‌నే ఇకముందు కొనసాగించాలని... మరిన్ని మ్యాచ్‌లాడాలని ఎప్పటికప్పుడు కసరత్తులు చేస్తున్నాను.
గతేడాది (2016) మీ ప్రదర్శన బాగుంది. ఈపీఎల్ సహా ఇతర టోర్నీలు కలిపి చూస్తే ఇప్పటికే 50 గోల్స్ చేశారు. ఇదే జోరు కొనసాగిస్తారా?
నిజమే. నా ఆటతీరుపట్ల సంతృప్తిగానే ఉంది. కానీ గోల్స్ ఒక్కటే నా లక్ష్యం కాదు. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తాను. జట్టు ట్రోఫీ గెలిచేందుకు ఎలాంటి పాత్రయినా పోషిస్తాను. ఎందుకంటే ఒక ఆటగాడు గోల్స్‌పైనే దృష్టిపెట్టాడంటే తనొక్కడే ఫోకస్ కావాలని లక్ష్యం అందులో కనిపిస్తుంది. కానీ నేను మాత్రం అలా కాదు.
కొత్త ఏడాదిలో మీరేమైనా లక్ష్యాలు నిర్దేశించుకున్నారా?
ఈ ఏడాది నేను మైదానంలో మరింత మెరుగైన సహాయక పాత్ర పోషించాలనుకుంటున్నాను. సహచరులు గోల్స్ చేసేందుకు చురుగ్గా స్పందించేందుకు కసరత్తు చేస్తున్నాను. గోల్‌పోస్టే లక్ష్యంగా బంతిని వేగంగా పాస్ చేయడం ద్వారా సహచరుల స్కోరింగ్ కూడా పెరుగుతుంది.
మీరు టైటిల్ రేసులో ఉన్నారా?
కష్టపడితే రేసులోకి వస్తాం. ముందుగా మేం బాగా ఆడాలి. అలాగే ప్రత్యర్థి జట్లు పొరపాట్లు చేస్తే వాటి నుంచి లబ్దిపొందే అవకాశాలను మెరుగుపర్చుకుంటేనే మళ్లీ గాడిన పడతాం. అంతిమంగా... నా జట్టుకు టైటిల్ అందించడమే నా లక్ష్యం.
కష్టపడితే టైటిల్ గెలుస్తాం
Published Mon, Jan 2 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM
Advertisement
Advertisement