గెలుపుబాట పడతాం
జ్లాటన్ ఇబ్రహిమోవిచ్ ఇంటర్వ్యూ
ఈ సీజన్ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో జోరు మీదున్న మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రయికర్ జ్లాటన్ ఇబ్రహిమోవిచ్ తమ జట్టు మళ్లీ గెలుపుబాట పడుతుందని చెప్పాడు. వరుస ‘డ్రా’లతో అభిమానులను నిరాశపరిచినప్పటికీ... మెరుగైన ఆటతీరుతో మళ్లీ పుంజుకుంటామన్నాడు. 42 మ్యాచ్‌లాడిన అతను 27 గోల్స్‌తో సత్తా చాటుకున్నాడు. తదుపరి సందర్‌లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో జట్టు రాణిస్తుందన్నాడు. ఇంకా ఏమన్నాడంటే...
వ్యక్తిగతంగా ఈ సీజన్ మీకు సంతృప్తికరంగా సాగుతోంది. 35 ఏళ్ల వయసులో యువకులకు దీటుగా ఆడటంపై ఎలా స్పందిస్తారు?
చాలా సంతోషంగా ఉంది. ప్రతీ ఏడాది ఎలా రాణిస్తానో ఈ సీజన్‌లో కూడా అలాగే ఆడాను. కానీ దీన్ని కొందరు విమర్శకులే అంగీకరించరు. నాకైతే వయస్సుపై బెంగలేదు. నా సామర్థ్యమేంటో నాకు తెలుసు. ఈ సీజన్‌లో నా ప్రదర్శన చక్కగా ఉంది.
ఇంకా ఎన్నేళ్లు ఆడాలనుకుంటున్నారు? 40 ఏళ్ల దాకా ఆడతారా?
అదెలా చెప్పగలను. ఇబ్రహిమోవిచ్ మునుపటిలా రాణించడం లేదంటే ఆడను. నా ప్రదర్శన బాగా లేకపోయినా, గోల్స్ సాధించే సత్తా తగ్గినా ఆడను. ఫలితాలు తెచ్చే సామర్థ్యమున్నంత వరకు బరిలోకి దిగుతాను.
తదుపరి సీజన్‌లో ఎవరితో ఉంటారు?
చూద్దాం ఏం జరుగుతుందో. ఈ సీజన్‌లో ఇంకా రెండు నెలల సమయముంది. ఆ తర్వాతే తేలుతుంది. క్లబ్‌లు నా నుంచి ఏం ఆశిస్తాయో... నేను ఏం చేస్తానో... ఇప్పుడైతే ఏం చెప్పలేను.
వరుస ‘డ్రా’లు మాంచెస్టర్‌ను, అభిమానుల్ని నిరాశపరుస్తున్నాయిగా?
నిజమే. మేం ఇందులో మెరుగవ్వాల్సిందే. గెలవాల్సిన మ్యాచ్‌ల్ని ‘డ్రా’లతో ముగించడం ఎవరికైనా నిరాశను పెంచేదే! ఇప్పుడీ గుణపాఠాలతో మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. గోల్స్ చేసేందుకు మరింత కష్టపడతాం. మ్యాచ్‌లో గెలిచే అవకాశాల్ని సృష్టించుకుంటాం.