
హైదరాబాద్: టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. క్రికెటర్లపై పనిభారం పడకుండా బీసీసీఐ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా టీమిండియాను గాయాల సమస్య వీడట్లేదు. ఇప్పటికే ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు వెన్నుగాయం తిరగబెట్టింది. దీంతో దాదాపు ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ సమయంలో వెన్నుగాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
(ఫైల్ ఫోటో)
మంగళవారం హార్దిక్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వెన్నునొప్పితో బాధపడ్డాడు. దీంతో అతడికి వైద్యపరీక్షల చేసిన వైద్యులు గాయం తీవ్రత దృష్ట్యా కనీసం ఐదు నెలల విశ్రాంతి అసరమని తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా శస్త్రచికిత్స కూడా అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెన్ను గాయానికి మైరుగైన చికిత్స కోసం బ్రుమాను ఇంగ్లండ్‌కు పంపించిన బీసీసీఐ.. హార్దిక్‌ను కూడా అక్కడికే పంపించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు హార్దిక్ దూరమవనున్నాడని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే హార్దిక్ గాయం తీవ్రత దృష్ట్యా వచ్చే ఐపీఎల్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.