టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ (PC: PTI)
‘‘రోహిత్ శర్మ వయసు ఇప్పుడు అటూ ఇటుగా.. 36- 37 ఏళ్లు ఉంటుంది. ఇంకో రెండేళ్లపాటు చురుగ్గా క్రికెట్ ఆడతాడేమో! వాస్తవానికి అతడు సూపర్ కెప్టెన్. అంతేకాదు అద్భుతమైన ఆటగాడు కూడా!
అతడిని చూసినప్పుడల్లా కాలాన్ని తన బ్యాటింగ్ మాయతో ఆపేస్తాడేమో అన్నట్లుగా ఉంటుంది. అయితే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. అతడి బాధ్యతలు తీసుకునేందుకు మరొకరిని సన్నద్ధం చేయాలి కదా.
నా వరకైతే టీమిండియా ఫ్యూచర్ హార్దిక్ పాండ్యా’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా పగ్గాలు చేపట్టేది పాండ్యానేనని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిందని పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రోహిత్ శర్మపై వేటు వేసి సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. ఫలితంగా పాండ్యాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.
ఇక తొలి మూడు మ్యాచ్‌లలోనూ ముంబై ఓడిపోవడంతో పాండ్యాపై విమర్శలు శ్రుతిమించాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపుతో ముంబై ఆదివారం పాయింట్ల ఖాతా తెరిచింది. ఇదిలా ఉంటే.. పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ప్రకటించిన తరుణంలోనే బీసీసీఐ టీ20 వరల్డ్‌కప్-2024 సారథిగా రోహిత్ శర్మ పేరును అనౌన్స్ చేసింది.
ఈ నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు ఈ పరిణామాలపై ఇండియా టుడేతో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘టెస్టులకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నేను ఎన్నటికీ సూచించను. అయితే, అతడు టీమిండియా వైస్ కెప్టెన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి.
రోహిత్ గైర్హాజరీలో దాదాపు ఏడాది పాటు టీ20 జట్టును నడిపించాడు. కాబట్టి సహజంగానే తదుపరి కెప్టెన్‌గా హార్దిక్ మాత్రమే ఛాయిస్. అందుకే బీసీసీఐ ముందస్తు చర్యల్లో భాగంగా అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించింది.
ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు బోర్డు పెద్దలు అన్ని రకాలుగా ఆలోచించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు తదుపరి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే వారి ఛాయిస్’’ అని సిద్ధు అభిప్రాయపడ్డాడు.
ఇక టెస్టుల్లో రోహిత్ శర్మ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా టీమిండియా కెప్టెన్ అవుతాడని నవజ్యోత్ సింగ్ సిద్ధు అంచనా వేశాడు. ఇంగ్లండ్‌లో జట్టును ముందుండి నడిపించిన అనుభవం అతడికి ఉందని పేర్కొన్నాడు.
చదవండి: T20 WC: సెలక్టర్లూ.. అతడిపై ఓ కన్నేసి ఉంచండి: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment