న్యూఢిల్లీ: టీమిండియా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో హార్దిక్ పాండ్యా ప్రతిభకు ఎవరూ సరితూగలేరని సెహ్వాగ్ కొనియాడాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ 12లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒకవైపు బ్యాటు, మరోవైపు బంతితో రాణించి ఔరా అనిపించాడు. ముంబై ఇండియన్స్‌కు కప్ గెలవడంతో హార్దిక్ ప్రధాన పాత్ర పోషించాడు.త్వరలో ప్రపంచకప్ మొదలవనున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ప్రతిభపై సెహ్వాగ్ స్పందించాడు.
'బ్యాటింగ్, బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా ప్రతిభకు దగ్గరలో కూడా ఎవరూ లేరు. ఒకవేళ బీసీసీఐ ఎంపిక చేసిన త్రీ డైమెన్షన్ ప్లేయర్లలో హార్దిక్‌తో ఎవరైనా సమానంగా ఉండి ఉంటే.. అతను తిరిగి జట్టుకు ఎంపికయ్యేవాడే కాదు' అని సెహ్వాగ్ అన్నారు. కాఫీ విత్ కరణ్ షో వివాదంతో హార్దిక్, కేఎల్ రాహుల్‌లపై బీసీసీఐ తాత్కాలిక సస్పెన్షన్‌తో పాటు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అనంతరం ఐపీఎల్ 12లో ఈ ఇద్దరు అదరగొట్టారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ.. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 191.42 స్ట్రెక్‌రేట్‌తో 402 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 91. ఇక బంతితో 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment