మ్యాచ్ స్వరూపం మారింది అక్కడే:కోహ్లి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 26 పరుగుల తేడాతో(డక్ వర్త్ లూయిస్ ప్రకారం) విజయం సాధించి ద్వైపాక్షిక సిరీస్ లో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ఎమ్మెస్ ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌లో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. మహేంద్ర సింగ్ ధోని కుదురుగా ఆడితే, హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడాడు. వీరిద్దరూ 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. ఈ క్రమంలోనే పాండ్యా ముందుగా హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై ధోని అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం వీరి ఇన్నింగ్స్ ను కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రత్యేకంగా కొనియాడారు.
'మేమే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడానికి కారణం స్కోరు బోర్డుపై భారీ స్కోరు ఉంచడం కోసమే. కాకపోతే ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాం. ఆ సమయంలో ధోని నుంచి చక్కటి సహకారం లభించింది. మేము అనుకున్నట్లుగానే ధోని మ్యాచ్ ను నిలబెట్టాడు. కేదర్ జాదవ్తో కలిసి ముందు మ్యాచ్పై పట్టుసాధించే యత్నం చేశాడు. ప్రధానంగా హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడటం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఒకవైపు ధోని నిలకడను కొనసాగిస్తే, హార్దిక్ ఎదురుదాడికి దిగి సక్సెస్ అయ్యాడు. హార్దిక్ ఒక కచ్చితమైన ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. మా జట్టులో హార్దిక్ ఉండటం నిజంగా అదృష్టం. తొలి వన్డేలో విజయం సాధించడానికి మిడిల్ ఆర్డర్తో పాటు లోయర్ ఆర్డరే కారణం. మేము మిడిల్-లోయర్ ఆర్డర్ లో ఎంత బలంగా ఉన్నామో చెప్పడానికి ఈ మ్యాచ్ చాలు. ధోని అనుభవం మరొకసారి మాకు ఉపయోగపడింది'అని కోహ్లి పేర్కొన్నారు.