
లండన్ : ఐర్లాండ్‌తో బుధవారం నుంచి జరగనున్న రెండు మ్యాచ్‌లు టీ-20 సిరీస్ ఆడేందుకు టీమిండియా జట్టు మంగళవారం బ్రిటన్ చేరుకుంది. ఇండియా నుంచి ప్రత్యేక విమానంలో బ్రిటన్ బయలుదేరిన టీమిండియా ఆటగాళ్లు.. గగనయానంలో సరదా సరదాగా గడిపారు. హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అందుకు కారణం ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్య తోటి ఆటగాళ్లను, మేనేజ్‌మెంట్ సిబ్బందిని ఇంటర్వ్యూ చేయడమే.. విమానంలో సరదాగా అతడు చేసిన ఇంటర్వ్యూ వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను అలరిస్తోంది.
ఇంగ్లాండ్ పర్యటనపై ఏమనుకుంటున్నారు? భారత జట్టులో డాన్ ఎవరు? సూపర్ మ్యాన్ ఎవరు? చాహల్ గురించి రోహిత్ శర్మ ఏం చెప్పాడు.. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు, సరదా సరదా ప్రశ్నలతో పాండ్య, చాహల్ కొంత హంగామా చేశారు. తోటి ఆటగాళ్లకు ఎంటర్‌టైన్‌మెంట్ పంచారు. మరో విషయం ఏమిటంటే పాండ్య.. ధోనీని ఏమీ అడగలేకపోయాడు. తన వద్దకు వచ్చిన పాండ్యకు ధోనీ ఒక బిస్కెట్ ఇచ్చి.. వెళ్లాల్సిందిగా సూచించడంతో అతడు.. ధోనీని వదిలేసి పక్కనే ఉన్న ధావన్ వద్దకు వెళ్లాడు. ఇంగ్లండ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఎంతో సరదాగా గడపవచ్చునని, గొప్ప క్రికెట్ ఆడుతూ.. ఆస్వాదించవచ్చునని కోహ్లి ఈ వీడియోలో పేర్కొన్నాడు. ఇక, తొలిసారి టీమిండియాతో ఇంగ్లండ్ వస్తున్న కేఎల్ రాహుల్ లాంటి వారికి ఇది సువర్ణావకాశమని చెప్పాడు. ఇక ఈ వీడియోలో ఇంటర్వ్యూ చేసిన పాండ్యనే డాన్ అని దినేశ్ కార్తీక్ పేర్కొనగా.. చాహల్ వద్ద చెమట వాసన వస్తోంది..డియోడ్రెంట్ వాడాలంటూ రోహిత్ సరదాగా సెటైర్లు వేశాడు. మనీష్ పాండే హెయిర్‌స్టైల్‌పైన పాండ్య, చాహల్ జోకులు పేల్చారు.