మెరిసిన హారిక, హంపి | Harika, Hampi won in World Womens Chess | Sakshi
Sakshi News home page

మెరిసిన హారిక, హంపి

Published Wed, Apr 29 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM

మెరిసిన హారిక, హంపి

మెరిసిన హారిక, హంపి

► ప్రపంచ మహిళల టీమ్ చెస్‌లో రజత, కాంస్య పతకాలు
► భారత్‌కు నాలుగో స్థానం


చెంగ్డూ (చైనా): ప్రపంచ చెస్ వేదికపై మరోసారి తెలుగు తేజాలు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి సత్తా చాటుకున్నారు. మంగళవారం ముగిసిన ప్రపంచ మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత విభాగంలో హారిక రజత పతకం సాధించగా... హంపి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. టీమ్ విభాగంలో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచి మరోసారి తమ అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేసింది. 2011 టర్కీలో జరిగిన ఈవెంట్‌లోనూ భారత్ నాలుగో స్థానాన్ని పొందింది.

ఈసారి ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన భారత జట్టు 10 జట్లు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్‌లో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 10 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. 17 పాయింట్లతో జార్జియా విజేతగా నిలువగా... 15 పాయింట్లతో రష్యా రెండో స్థానాన్ని... 11 పాయింట్లతో చైనా మూడో స్థానాన్ని సాధించాయి. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో భారత్ 3-1తో ఆర్మేనియాపై గెలిచింది. హంపి 52 ఎత్తుల్లో లిలిత్ చేతిలో ఓడిపోగా... హారిక 41 ఎత్తుల్లో లిలిత్ గలోజాన్‌పై; పద్మిని రౌత్ 59 ఎత్తుల్లో మరియా కుర్సోవాపై; సౌమ్య స్వామినాథన్ 36 ఎత్తుల్లో సుసానా గబోయాన్‌పై విజయం సాధించారు. ఆయా దేశాల టాప్-4 క్రీడాకారిణులు వరుసగా తొలి నాలుగు బోర్డులపై ఆడతారు.

 బోర్డు-2పై ఆడిన హారిక 5.5 పాయింట్లతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. తొలుత గేమ్‌లు ఆడిన శాతం (68.8)... ఆ తర్వాత పా యింట్ల ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా ఇద్దరూ సమంగా నిలిచారు. దాంతో ఈ టోర్నీలో వీరిద్దరు కనబరిచిన రేటింగ్ ప్రదర్శన ఆధారంగా హారిక (2565)కు రజతం ఖాయమైంది. మరియా (2552)కు కాంస్యం దక్కింది. 6.5 పాయింట్లతో లిలిత్ ఎంక్రిట్‌చియాన్ (ఆర్మేనియా)కు స్వర్ణం లభించింది.

గుంటూరు జిల్లాకు చెందిన హారిక ఈ టోర్నీలో ఆడిన ఎనిమిది గేముల్లోనూ అజేయంగా నిలిచింది. మూడు గేముల్లో గెలిచి, మిగతా ఐదింటిని ‘డ్రా’ చేసుకుంది. ఈజిప్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆమె బరిలోకి దిగలేదు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో హారిక రజతం సాధించడం ఇది రెండోసారి. 2011 టర్కీలో జరిగిన పోటీల్లోనూ హారిక బోర్డు-2పైనే రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. ఈ నెలారంభంలో రష్యాలోని సోచిలో జరిగిన ప్రపంచ చెస్ నాకౌట్ చాంపియన్‌షిప్‌లో హారిక సెమీఫైనల్ చేరుకొని కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

ఇక బోర్డు-1పై ఆడిన కోనేరు హంపి 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. నిబంధనల ప్రకారం పతకాన్ని ఖరారు చేసేందుకు ముందుగా ఆడిన గేమ్‌ల శాతాన్ని, ఆ తర్వాత పాయింట్లను, రేటింగ్ ప్రదర్శనను లెక్కలోకి తీసుకోవడంతో హంపి మూడో స్థానంలో నిలవాల్సి వచ్చింది. హంపి 9 గేమ్‌లు ఆడగా... హంపి కంటే ఒక గేమ్ తక్కువగా ఆడిన వాలెంటినా గునీనా (రష్యా)కు రజతం లభించింది. 7.5 పాయింట్లతో బేలా ఖొతెనాష్‌విలి (జార్జియా) స్వర్ణం సంపాదించింది. ఈ పోటీల చరిత్రలో హంపికిది రెండో పతకం. 2011 టర్కీలో జరిగిన ఈవెంట్‌లో హంపి స్వర్ణం సాధించింది.
 
 హరికృష్ణకు చేజారిన పతకం
 
మరోవైపు ఆర్మేనియాలో ముగిసిన ప్రపంచ పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో భారత్ 1-3 పాయింట్ల తేడాతో చైనా చేతిలో ఓడిపోయింది. డింగ్ లిరెన్‌తో గేమ్‌ను హరికృష్ణ; జియాంగ్‌జీతో గేమ్‌ను శశికిరణ్ ‘డ్రా’ చేసుకోగా... సేతురామన్, దీప్ సేన్‌గుప్తా ఓడిపోయారు. వ్యక్తిగత విభాగంలో బోర్డు-1పై ఆడిన తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. హరికృష్ణ, డొమింగెజ్ పెరెజ్ (క్యూబా) గేమ్‌లు ఆడిన శాతం, పాయింట్ల ఆధారంగా సమఉజ్జీగా నిలిచినా... ఈ టోర్నీలో మెరుగైన రేటింగ్ ప్రదర్శన ఆధారంగా పెరెజ్ (2724)కు కాంస్యం దక్కగా, హరికృష్ణ (2707) నాలుగో స్థానంతో సంతృప్తి పడ్డాడు. ఈ టోర్నీలో హరికృష్ణ తొమ్మిది గేమ్‌లు ఆడి ఒక దాంట్లో నెగ్గి, మిగతా ఎనిమిదింటిని ‘డ్రా’ చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement