
సూపర్ నోవాస్ సెల్ఫీ
ముంబై: మైదానంలో అంతగా ప్రేక్షకులు లేకున్నా... భారీ స్కోర్లు నమోదు కాకున్నా... మహిళల టి20 ఎగ్జిబిషన్ మ్యాచ్ చివరి బంతి వరకు సాగి ఆకట్టుకుంది. మహిళల ఐపీఎల్ నిర్వహణ వైపు ముందడుగుగా చెప్పుకొంటున్న ఈ మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్‌పై సూపర్ నోవాస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మంగళవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో తొలుత ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. సుజీ బేట్స్ (37 బంతుల్లో 32; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. జెమీమా (23 బంతుల్లో 25; 3 ఫోర్లు), దీప్తి శర్మ (22 బంతుల్లో 21; 3 ఫోర్లు) రాణించారు.
షుట్ (2/18), పెర్రీ (2/20) రెండేసి వికెట్లు తీశారు. ఛేదనలో తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించి సూపర్ నోవాస్‌కు మిథాలీ రాజ్ (17 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), వ్యాట్ (20 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. అయితే 9 ఓవర్లకు 71/3తో లక్ష్యం దిశగా సాగిపోతున్న నోవాస్‌ను బ్లేజర్స్ బౌలర్లు కట్టడి చేశారు. డివైన్ (20 బంతుల్లో 19; 1 సిక్స్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (23 బంతుల్లో 21; 1 ఫోర్) వేగంగా ఆడలేకపోయారు. వరుసగా వికెట్లు పడటంతో పాటు పరుగుల రాక కూడా కష్టమైంది. చివరికి సమీకరణం 6 బంతుల్లో 4 పరుగులుగా మారింది. పెర్రీ (14 బంతుల్లో 13 నాటౌట్, 1 ఫోర్), వస్త్రాకర్ (2 నాటౌట్) తొలి మూడు బంతుల్లో ఒక పరుగే చేసినా... చివరి 3 బంతులకు సింగిల్స్ తీసి ముగించారు.