'క్రికెట్ కోచ్ల వల్ల ఉపయోగం లేదు'
కరాచీ: ఏ జాతీయ క్రికెట్ జట్టుకైనా కోచ్ ఉండటం అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. ఒక్కమాటలోచెప్పాలంటే అసలు కోచ్లేని క్రికెట్ జట్టు ఉండదంటే అతిశయోక్తికాదేమో. అయితే జాతీయ క్రికెట్ జట్లకు కోచ్లను నియమించడాన్ని పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు అబ్దుల్ ఖాదిర్ తీవ్రంగా తప్పుబట్టాడు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని తేల్చిపారేశాడు. అసలు క్రికెట్ కోచ్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల డబ్బు వృథా కావడమే తప్పితే ప్రయోజనం శూన్యమైన్నాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గ్రహించి కోచ్ ల నియమాకాన్ని నిలపివేసే నిబంధనను తీసుకువస్తే బాగుంటుందన్నాడు.
'పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇదే నా సలహా. చీఫ్ కోచ్ నియమాకానికి చరమగీతం పాడండి. దానివల్ల ధనంతో పాటు శక్తి కూడా ఆదా అవుతుంది. ఒక పాకిస్తానే కాదు.. మిగతా దేశాల క్రికెట్ జట్లు కూడా కోచ్ల వల్ల సాధించేదేమీ లేదు. కోచ్లను ప్రమోట్ చేసే విధానాన్ని కూడా ఐసీసీ నిలిపివేయాలి. అంతర్జాతీయ స్థాయిలో జట్టును నడిపించే కెప్టెన్ ఉన్నప్పుడు.. కోచ్ అవసరం లేదు'అని అబ్దుల్ ఖాదిర్ పేర్కొన్నాడు.
1999 నుంచి 2014 వరకూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు పలువురు విదేశీ కోచ్లనూ నియమిస్తూనే వచ్చింది. అయినా ఫలితం శూన్యం. 1992 వరల్డ్ కప్తో పాటు 2009 లో వరల్డ్ టీ 20 టైటిల్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు ఇంతికాబ్ అలామ్ ఇంఛార్జిగా ఉన్న సంగతిని ఈ సందర్భంగా ఖాదిర్ గుర్తు చేశాడు.