హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు, ఎన్నికల పర్యవేక్షణకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు
హెచ్‌సీఏ ఎన్నికలపై పిటిషన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు, ఎన్నికల పర్యవేక్షణకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కింది కోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ సెయింట్ ఆండ్రూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు దయానంద్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపారు. ఈ వ్యాజ్యం విచారణార్హతపై న్యాయమూర్తి సందేహం వ్యక్తం చేశారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది బి.విజయసేన్‌రెడ్డి స్పందిస్తూ, జస్టిస్ లోథా కమిటీ సిఫారసుల మేరకు హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కేంద్ర రిటైర్డ్ ఎన్నికల కమిషనర్‌కు లేదా రాష్ట్ర రిటైర్డ్ ఎన్నికల కమిషనర్‌కు అప్పగించాల్సి ఉందన్నారు. అయితే కింది కోర్టు దీనికి విరుద్ధంగా అడ్వొకేట్ కమిషన్‌ను నియమించిందని తెలిపారు. దీంతో న్యాయమూర్తి పూర్తిస్థాయిలో వాదనలు వింటానని స్పష్టం చేస్తూ కేసును సోమవారానికి వాయిదా వేశారు.