HCA election
-
కేసు విచారణార్హతపై హైకోర్టు సందేహం
హెచ్‌సీఏ ఎన్నికలపై పిటిషన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు, ఎన్నికల పర్యవేక్షణకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కింది కోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ సెయింట్ ఆండ్రూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు దయానంద్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపారు. ఈ వ్యాజ్యం విచారణార్హతపై న్యాయమూర్తి సందేహం వ్యక్తం చేశారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది బి.విజయసేన్‌రెడ్డి స్పందిస్తూ, జస్టిస్ లోథా కమిటీ సిఫారసుల మేరకు హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కేంద్ర రిటైర్డ్ ఎన్నికల కమిషనర్‌కు లేదా రాష్ట్ర రిటైర్డ్ ఎన్నికల కమిషనర్‌కు అప్పగించాల్సి ఉందన్నారు. అయితే కింది కోర్టు దీనికి విరుద్ధంగా అడ్వొకేట్ కమిషన్‌ను నియమించిందని తెలిపారు. దీంతో న్యాయమూర్తి పూర్తిస్థాయిలో వాదనలు వింటానని స్పష్టం చేస్తూ కేసును సోమవారానికి వాయిదా వేశారు. -
హెచ్‌సీఏ ఎన్నికలు ప్రశాంతం
కోర్టు ఉత్తర్వుల తర్వాతే ఫలితాల వెల్లడి సాక్షి, హైదరాబాద్: నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచి అనూహ్య పరిణామాలతో ఆసక్తి రేపిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు మంగళవారం ముగిశాయి. ఇరు వర్గాల మధ్య వాదవివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది ఎదురు కావచ్చని భావించినా... చివరకు ఎలాంటి నిరసన, సమస్య లేకుండా సజావుగా ఎన్నికలు జరిగాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ఆరు పదవుల కోసం మొత్తం 19 మంది పోటీ పడ్డారు. మొత్తం ఓటర్ల సంఖ్య 216 కాగా, ఎన్నికల్లో 207 ఓట్లు పోలయ్యాయి. రిటర్నింగ్ అధికారి కె.రాజీవ్ రెడ్డి ఈ ఎన్నికలను పర్యవేక్షించారు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద్, విద్యుత్ జైసింహ మధ్య పోటీ నెలకొంది. కార్యదర్శి స్థానానికి శేష్ నారాయణ్ మాత్రమే పోటీ పడ్డారు. ఉపాధ్యక్ష పదవికి అనిల్ కుమార్, ఇమ్రాన్ మెహమూద్... సంయుక్త కార్యదర్శి స్థానానికి వంకా ప్రతాప్, అజ్మల్ అసద్ బరిలో నిలిచారు. అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు సిద్ధమైన భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ నామినేషన్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహించగా, ఫలితాలను మాత్రం ప్రకటించరాదంటూ హైకోర్టు గత వారం ఆదేశించింది. దాంతో ప్రస్తుతానికి బ్యాలెట్ బాక్స్‌లను ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తారు. మరోవైపు ఈ ఎన్నికలు మొత్తం లోధా కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. అందువల్ల నేడు ఎన్నికల చెల్లుబాటుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన నామినేషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అజహరుద్దీన్ మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. -
అజారుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్‌పై అజరుద్దీన్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని హెచ్‌సీఏ నూతన కార్యదర్శి శేషు నారాయణ అన్నారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ తన నామినేషన్ తిరస్కరించారన్న ఆక్రోశంతోనే అజహర్ మాట్లాడుతున్నారన్నారు. వివేక్‌పై అజహర్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అలాగే వివేక్‌కు అనర్హత వర్తించదని శేషు నారాయణ పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి అజహర్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. జీవిత కాల నిషేధంపై అజహర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్, జయసింహ రేసులో ఉన్నారు. మరోవైపు నామినేషన్ తిరస్కరణపై అజహర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. -
అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ
-
అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ
హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి ఆయన వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్‌పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్‌ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేదు. అయితే జీవిత కాల నిషేధంపై అజహర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్లు సమాచారం. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్, జయసింహ రేసులో ఉన్నారు. మరోవైపు నామినేషన్ తిరస్కరణపై అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం హెచ్‌సీఏ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి.