కోచ్ ఓల్ట్‌మన్స్‌కు ఉద్వాసన
హాకీ ఇండియా అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్‌ను హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఉన్నపళంగా తప్పించింది. హై పెర్ఫార్మెన్స్, డెవలప్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం కోచ్‌ను తప్పిస్తున్నట్లు హెచ్‌ఐ వెల్లడించింది. హాకీ జట్టు ఇంటా బయటా ఆశించిన ఫలితాలు సాధించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్‌కు తాత్కాలిక కోచ్ బాధ్యతలు అప్పగించింది.
పూర్తిస్థాయి కోచ్ నియామకం జరిగే వరకు ఆయన సీనియర్ జట్టు కోచ్‌గా పనిచేస్తారని హెచ్‌ఐ తెలిపింది. హాలెండ్‌కు చెందిన ఓల్ట్‌మన్స్ తొలుత 2013లో హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా చేరారు. అనంతరం 2015 జూలైలో కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన మార్గదర్శనంలోనే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ రజతం సాధించింది. జూనియర్ జట్టు ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. అయితే అజ్లాన్ షా, హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ ఈవెంట్లలో భారత్ తమ కన్నా తక్కువ ర్యాంకు ఉన్న మలేసియా, కెనడా జట్ల చేతిలో ఓడటం హెచ్‌ఐ ఉన్నతాధికారులను అసంతృప్తి పరిచింది.