లుసానే: కరోనా (కోవిడ్–19) దెబ్బకు స్పోర్ట్స్ ఈవెంట్‌ల వాయిదా పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఐపీఎల్, ఈపీఎల్, ఎన్‌బీఏ, ఫార్ములావన్, బ్యాడ్మింటన్, టెన్నిస్‌లాంటి విఖ్యాత స్పోర్ట్స్ ఈవెంట్స్ వాయిదా పడగా... తాజాగా ఆ జాబితాలోకి హాకీ ప్రొ లీగ్ కూడా జరిగింది. ప్రస్తుతం జరుగుతోన్న ఈ లీగ్ రెండో సీజన్‌లో ఏప్రిల్ 15 వరకు జరిగే అన్ని మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) శనివారం ప్రకటించింది. అయితే వీటిని తిరిగి నిర్వహించేది లేనిది తెలియాల్సి ఉంది. ‘కరోనాపై మాకు అందుతున్న సమాచారం, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆదేశాలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను పరిగణలోకి తీసుకుంటూ... ఏప్రిల్ 15 వరకు జరిగే ప్రొ లీగ్ మ్యాచ్‌లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఎఫ్‌ఐహెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లీగ్‌లో ఆడుతున్న హాకీ దేశాల సంఘాలతో చర్చించాకే ఎఫ్‌ఐహెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నాటికి కరోనా ఉధృతి తగ్గినట్లయితే... అదే నెల చివర్లో ఈ లీగ్ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎఫ్‌ఐహెచ్ పేర్కొంది. ఈ లీగ్‌లో మొత్తం 9 జట్లు పాల్గొంటుండగా... భారత్ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 26న బెర్లిన్ వేదికగా జర్మనీతో ఆడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment