పనాజీ: కరోనా మహమ్మారి మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణపై తన ప్రభావం చూపనుంది. భారత్ వేదికగా జరుగనున్న ‘ఫిఫా’ అండర్–17 మహిళల వరల్డ్ కప్ టోర్నీ మరోసారి వాయిదా పడే అవకాశాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన ఈ టోర్నీ కోవిడ్–19 కారణంగా వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. అయితే ఇది మరోసారి వాయిదా పడే అవకాశముందని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరు వరకు దీనిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. చాలా దేశాల్లో వరల్డ్‌కప్ అర్హత టోర్నీలు కూడా ఇంకా ముగియలేదని, ఈ పరిస్థితుల్లో అంతా సవ్యంగా జరగడం కష్టమని వ్యాఖ్యానించారు. ‘ఫిఫా’ వర్గాలు కూడా ఇదే ఆలోచిస్తున్నట్లుగా తాజా వ్యాఖ్యలతో తెలుస్తోంది. ఆట కన్నా దానితో ముడిపడి ఉన్న వారి ఆరోగ్య భద్రతే తమకు ప్రధానమని ‘ఫిఫా’ అధికార ప్రతినిధి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment