
భువనేశ్వర్: హాకీ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. పూల్ ‘బి’లో భాగంగా శుక్రవారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2–1తో ఐర్లాండ్‌పై కష్టపడి నెగ్గింది. గత రెండు వరల్డ్‌కప్ (2010, 2014)లను చేజిక్కించుకొని ‘హ్యాట్రిక్’పై కన్నేసిన ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభ మ్యాచ్‌లో గట్టి పోటీ ఎదురైంది. ప్రపంచ నంబర్‌వన్ ఆసీస్‌కు పదో ర్యాంకర్ ఐర్లాండ్ ముచ్చెమటలు పట్టించింది. దూకుడైన అటాకింగ్‌తో పాటు దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో ఒక పట్టాన కొరుకుడు పడలేదు. ఆస్ట్రేలియా తరఫున బ్లేక్ గోవర్స్ (11వ నిమిషంలో), టిమ్ బ్రాండ్ (34వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... ఐర్లాండ్ తరఫున షేన్ ఒడోనోగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 6 పెనాల్టీ కార్నర్‌లు లభించగా వాటిలో కేవలం ఒక్కదాన్నే గోల్‌గా మలచగలిగింది.
మ్యాచ్ ఆరంభం నుంచి ఐర్లాండ్ తొలిగోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది.
11వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను బ్లేక్ గోవర్స్ గోల్‌గా మలిచి ఆసీస్‌కు 1–0తో ఆధిక్యం అందించాడు. మరో రెండు నిమిషాల్లో షేన్ గోల్‌తో ఐర్లాండ్ స్కోరు సమం చేసింది. ఈ దశలో ఆసీస్ దూకుడైన ఆట తీరుతో పదే పదే ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులకు దిగింది. వాటిని ఐర్లాండ్ రక్షణ పంక్తి సమర్థంగా అడ్డుకుంది. మూడో క్వార్టర్‌లో టీమ్ బ్రాండ్ గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆసీస్ చివరివరకు దాన్ని నిలుపుకొని విజయం సొంతం చేసుకుంది. ఇంగ్లండ్, చైనాల మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలిసారి ప్రపంచకప్‌లో దిగిన చైనా చక్కటి ఆటతో ఆకట్టుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–2తో నిలిచాయి. ఇంగ్లండ్ తరఫున గ్లెగోర్న్ మార్క్ (14వ ని.లో), అన్సెల్ లియామ్ (48వ ని.లో) గోల్స్ చేయగా... చైనా తరఫున గుయో జియోపింగ్ (5వ ని.లో), దు టలాకే (59వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
ప్రపంచకప్‌లో నేడు
నెదర్లాండ్స్ (VS) మలేసియా
జర్మనీ (VS) పాకిస్తాన్
Comments
Please login to add a commentAdd a comment