బ్రిస్బేన్: కెప్టెన్ ఆరోన్ ఫించ్ (44 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చాలా కాలం తర్వాత ఆస్ట్రేలియాను గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టి20 ప్రపంచకప్‌లో సోమవారం జరిగిన ‘సూపర్–12’ మ్యాచ్‌లో ఆతిథ్య ఆసీస్ 42 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్–1లో ఫించ్ సేన న్యూజిలాండ్‌తో పాటు 5 పాయింట్లతో సమ ఉజ్జీగా నిలిచింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. స్టొయినిస్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. ఐర్లాండ్ బౌలర్ బారి మెకార్తీ (3/29) టాపార్డర్‌ను కూల్చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. లోర్కన్ టకర్ (48 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా, మ్యాక్స్‌వెల్ (2/14), స్టార్క్ (2/43) కీలక వికెట్లతో ఐర్లాండ్‌ను పడగొట్టారు.
ఫించ్ ఫిఫ్టీ
గత వరల్డ్ కప్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ డేవిడ్ వార్నర్ (3) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. లిటిల్, మెకార్తీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆరంభంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు కష్ట పడ్డారు. బౌండరీ కొట్టేందుకు మూడో ఓవర్‌దాకా వేచి చూడక తప్పలేదు. పవర్ ప్లే (6 ఓవర్లు)లో ఆసీస్ స్కోరు 38/1 మాత్రమే. అనంతరం ఫియోన్ హ్యాండ్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన మిచెల్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగం పెంచాడు.
కాసేపటికే అతన్ని అవుట్‌చేసి ఈ వేగానికి మెకార్తీ కళ్లెం వేశాడు. మ్యాక్స్‌వెల్ (13) త్వరగానే పెవిలియన్ చేరగా... స్టొయినిస్‌తో కలిసి ఫించ్ జట్టును నడిపించాడు. ఆసీస్ సారథి 38 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 70 పరుగులు జోడించాక ఫించ్ కూడా మెకార్తీ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు), వేడ్ (7 నాటౌట్) ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేశారు.
టకర్ నాటౌట్
పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను వారి సొంతగడ్డపై ఎదుర్కొనే సత్తా ఐర్లాండ్ బ్యాటర్స్‌కు లేకపోయినా... ఒకే ఒక్కడు టకర్ మాత్రం అదరగొట్టాడు. 25 పరుగులకే ఐర్లాండ్ సగం వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు స్టిర్లింగ్ (11), బాల్బిర్నీ (6) సహా ఆఖరి వరుస దాకా టెక్టర్ (6), కాంఫెర్ (0), డాక్రెల్ (0), డెలానీ (14), అడయిర్ (11), హ్యాండ్ (6), మెకార్తీ (3), లిటిల్ (1)... ఇలా ఏ ఒక్కరు కనీస ప్రదర్శన చేయలేకపోయినా వన్‌డౌన్‌లో వచ్చిన టకర్ అసాధారణ పోరాటం చేశాడు.
అండగా నిలిచే సహచరులు కరువైన చోట అతను 40 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు మినహా అంతా సింగిల్ డిజిట్‌కే నిష్క్రమించినా... తను మాత్రం ఆఖరి దాకా క్రీజులో నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్, స్టార్క్‌లతో పాటు కమిన్స్, జంపా తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఈ విజయంతో ఆసీస్ గ్రూప్-1లో రెండో స్థానానికి ఎగబాకింది. ఆసీస్ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం, మరో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో -0.304 రన్‌రేట్‌తో 5 పాయింట్లు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment