భారత్ బోణీ చేసేనా?
న్యూఢిల్లీ: హాకీ వరల్డ్‌లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జర్మనీని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం మూటగట్టుకున్న భారత్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్ ‘ఎ’లో టీమిండియా సోమవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ జర్మనీని నిలువరించాలంటే శక్తికి మించి శ్రమించాల్సిందే. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేసిన భారత ఆటగాళ్లు ఈ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేయాలంటే మెరుగైన ఆటతీరుతో పాటు పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలి.
గత మ్యాచ్‌ల్లో సర్దార్ సింగ్ జట్టులో మిడ్ ఫీల్డ్, ఫార్వర్డ్ శ్రేణి ఆటగాళ్ల మధ్య సమన్వయం కొరవడింది. మళ్లీ ఈ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. రఘునాథ్, రూపిందర్‌పాల్ సింగ్, అమిత్ రోహిదాస్‌లతో కూడా డ్రాగ్‌ఫ్లిక్ శ్రేణి ఇంతవరకూ అందివచ్చిన పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీనిపై జట్టు కోచ్ టెర్రీ వాల్ష్ కూడా ఆందోళన చెందుతున్నారు. టీమ్ మేనేజ్‌మెంట్ పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంపై దృష్టిపెట్టాలి.