భారత్ లేకుండా ఐసీసీనా?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఫైనాన్షియల్ కమిటీలో భారత్కు ప్రాతినిథ్యం ఇవ్వకపోవడాన్ని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఆదాయం వచ్చే భారత్ లేకుండా ఫైనాన్షియల్ కమిటీ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. 2018 సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీవీ ప్రసార హక్కుల కోసం ఓపెన్ టెండర్ల విధానానికి బీసీసీఐ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం 40 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చిన అనుగాగ్ ఠాకూర్ ప్రస్తుతం ఐసీసీ అవలంభిస్తున్న విధానంపై విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు మాతృభూమి కోసం ఆలోచించని వారు, ప్రపంచం గురించి ఎలా ఆలోచిస్తారని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పై పరోక్షంగా సెటైర్లు గుప్పించారు. ఐసీసీకి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే భారత్ లాంటి దేశం లేకుండా ఐసీసీని నడపలేరనే సంగతిని గుర్తించుకోవాలంటూ చురకలంటించారు.
భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటమే తన లక్ష్యమని, ఐసీసీలో పదవులు అందుకోవాలనే ఆశ తనకు లేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. తాను ఎక్కడ ఉన్నా బీసీసీఐ హక్కులను పరిరక్షించడమే తన బాధ్యత అని అనురాగ్ పేర్కొన్నారు. ఇటీవల తాను భారత్కు ప్రతినిధిని కాదంటూ ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దాదాపు 100 దేశాల బాధ్యత తనపై ఉందని, కేవలం భారత్పై దృష్టి సారించలేని పేర్కొన్నారు. దీంతో ఐసీసీ-బీసీసీఐల మధ్య రాజుకున్న వివాదం మరింత ముదిరింది.