టూ టైర్ టెస్ట్ సిస్టమ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తాం
టూ టైర్ టెస్ట్ సిస్టమ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దీనివల్ల క్రికెట్ ఆడే చిన్నదేశాలకు నష్టం వాటిల్లుతుందని, వాటి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. చిన్నదేశాల జట్లు పెద్ద దేశాలతో ఆడే అవకాశంతో పాటు రెవెన్యూను కూడా కోల్పోతాయని చెప్పారు. ప్రపంచ దేశాలన్నింటితో తమ జట్టు ఆడాలని కోరుకుంటున్నామని, ప్రపంచ క్రికెట్ ప్రయోజనాలు కాపాడేందుకు తాము ప్రాధాన్యమిస్తామని ఠాకూర్ స్పష్టం చేశారు.
టెస్టు క్రికెట్ను టూ టైర్స్గా (శ్రేణులు) విభజించాలని ఐసీసీ ప్రతిపాదించింది. దీనిప్రకారం ఓ దాంట్లో ఏడు దేశాలను, మరో దాంట్లో ఐదు దేశాలు, రెండు కొత్త టెస్టు హోదా దేశాలను చేర్చాలి. వన్డే, టి-20 ప్రపంచ కప్ల తరహాలో టెస్టు చాంపియన్షిప్ను నిర్వహించాలని ఐసీసీ సూచించింది. కాగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు మాత్రమే ఈ ప్రతిపాదనను సమర్థించాయి. ఐసీసీలో పెద్దన్న పాత్ర పోషించే బీసీసీఐ ఈ ప్రాతిపాదనను వ్యతిరేకించడంతో ఆచరణసాధ్యంకాదని భావిస్తున్నారు. బీసీసీఐ బాటలోనే ఇతర ఆసియా దేశాల క్రికెట్ బోర్డులు నడుస్తాయని భావిస్తున్నారు.