ఇంకా ఎన్ని సార్లు చెప్పాలి?
రిటైర్మెంట్ ప్రశ్నపై ధోని అసహనం బంగ్లాదేశ్‌కు బయలుదేరిన భారత జట్టు
కోల్‌కతా: తన రిటైర్మెంట్ గురించి పదే పదే ప్రశ్నలు అడగటంపై భారత వన్డే, టి20 కెప్టెన్ ఎమ్మెస్ ధోని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న వేస్తున్నారని, 15 రోజులు లేదా ఒక నెల వ్యవధిలో తన సమాధానం ఏమీ మారిపోదని అతను గట్టిగా చెప్పాడు. ‘ప్రశ్న ఎక్కడ అడిగినా పక్షం రోజుల్లో నా జవాబు మారిపోదు. నా పేరు ఏమిటి అనేంత సులభమైన ప్రశ్న అది. ఎప్పుడైనా ధోని అనే చెబుతాను. ప్రశ్న అడిగే అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒకటి అడిగేస్తే ఎలా. ఈ కాలంలో ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతుంది. అలాంటప్పుడు అదే ప్రశ్న పదే పదే ఎందుకు అడుగుతున్నారు. అసలు ఇదంతా అవసరమా అని ఎవరికి వారు ఆలోచించుకోవాలి’ అని కుండబద్దలు కొట్టాడు. భారత్‌లో ప్రతీదానిని ప్రశ్నిస్తారని, ప్రపంచకప్‌లో తాము గెలిచినా, ఓడినా వేర్వేరు ప్రశ్నలు సిద్ధంగా ఉంటాయన్న ధోని... మెరుగైన ప్రశ్నలు వేస్తే తాను కూడా 100 శాతం సమాధానం ఇస్తానని స్పష్టం చేశాడు.
అందరికీ అవకాశమిస్తాం...
టి20 ప్రపంచకప్‌కు ముందు ఎక్కువ సంఖ్యలో మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం అదృష్టమని, మన జట్టు వరుస విజయాలు సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని ధోని అన్నాడు. ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత జట్టు ఆదివారం ఢాకా బయల్దేరి వెళ్లింది. ఈ నెల 24న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. ‘పెద్ద టోర్నీలు గెలిచే సత్తా మా జట్టుకు ఉంది. అందరికీ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వాలని నేనూ ప్రయత్నిస్తున్నా. అందరూ ఫిట్‌గా ఉండటం కూడా కీలకం. ప్రస్తుతం జట్టు కూర్పు బాగుంది. అయితే పరిస్థితులను బట్టి ఇతర ఆటగాళ్లను కూడా పరీక్షించేందుకు ప్రయత్నిస్తాం’ అని ధోని వ్యాఖ్యానించాడు. ఐదో స్థా నం వరకు తమ బ్యాటింగ్ ఆర్డర్ స్థిరంగా ఉం దని, వారంతా నిలకడగా రాణిస్తున్నారు కాబట్టి తాను ఆరుకంటే ముందు స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం లేదని ధోని వెల్లడించాడు.
అంతా వారి చలవే...
దేశంలో అంతా ఇప్పుడు భావప్రకటన స్వేచ్ఛ గురించి చర్చ జరుగుతోందని, కానీ సరిహద్దులోని సైనికుల వల్లే అందరూ ఇంత నిబ్బరంగా మాట్లాడగలుగుతున్నారని ధోని అభిప్రాయపడ్డాడు. ‘స్పెషల్ ఫోర్స్‌లు, కమాండోలు తమ వ్యక్తిగత అంశాలకంటే జాతి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. మనల్ని వారు భద్రంగా కాపాడుతుండటం వల్లే ఈ రోజు చాలా మంది భావప్రకటన స్వేచ్ఛపై చర్చలు కొనసాగించగలుగుతున్నారు’ అని సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని తన మనోగతం వెల్లడించాడు.