టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మిస్టర్ కూల్ కెప్టెన్ అన్న బిరుదు ఉంది. ధోని ఆన్ ఫీల్డ్ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చాలా నింపాదిగా కనిపించేవాడు. టెన్షన్ అన్నది అతని ముఖంలో కనపడేది కాదు. విజయాలకు ఉప్పొంగిపోవడం.. ఓటములకు ఢీలా పడిపోవడం ధోనికి తెలీదు. అలాంటి ధోని ఒకానొక సందర్భంలో చిన్న పిల్లాడిలా మారిపోయాడు. ఎగిరెగిరి గంతులేశాడు. ఆ సందర్భం 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నాటిది.
2013, జూన్ 23న ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఫైనల్లో భారత్.. ఆతిథ్య ఇంగ్లండ్‌పై 5 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది, రెండో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో గెలుపు ఖరారైన వెంటనే మిస్టర్ కూల్ కెప్టెన్ మిస్టర్ జాలీ కెప్టెన్‌గా మారిపోయాడు. ఆ విజయం ధోనికి, అటూ టీమిండియాకు చాలా సంతృప్తినిచ్చింది. అందుకే ధోని తన శైలికి భిన్నంగా ప్రవర్తించాడు.
Relive @ashwinravi99's magical ball in #CT13 🪄
He bowled 4 overs, gave 15 runs including a maiden and took key wickets of Joe Root & Jonathan Trott in the final 👌pic.twitter.com/zBr1VkBVy8— CricTracker (@Cricketracker) September 17, 2024
ధోని వరల్డ్‌కప్‌లు గెలిచినప్పుడు కూడా అంత ఎగ్జైట్ కాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ధోనికి అంత తృప్తినిచ్చింది. ఈ విషయాన్ని ధోని స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఫైనల్లో భారత్ గెలిచిన తీరు.. నాటి మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయి. అందుకే భారత్‌కు అది చిరస్మరణీయ విజయంగా మిగిలిపోయింది. ముఖ్యంగా ధోని కెరీర్‌లో హైలైట్‌గా నిలిచిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో మూడు ఐసీసీ టైటిల్స్ (టీ20, వన్డే వరల్డ్‌కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన తొలి కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. వన్డే ఫార్మాట్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా టీ20 మ్యాచ్‌గా మార్చబడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 43, రవీంద్ర జడేజా 33 నాటౌట్, శిఖర్ ధవన్ 31 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 9, దినేశ్ కార్తీక్ 6, సురేశ్ రైనా 1, ధోని 0, అశ్విన్ 1 పరుగుకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రవి బొపారా 3, ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ట్రెడ్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు కలిసి కట్టుగా రాణించడంతో 5 పరుగుల స్వల్ప తేడాతో పరాజయంపాలైంది. రవిచంద్రన్ అశ్విన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటా నాలుగు ఓవర్లు వేసి ఓ మెయిడిన్ సహా రెండు కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ చివరి ఓవర్‌లో అశ్విన్ 15 పరుగులను విజయవంతంగా కాపాడుకుని భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అశ్విన్ వేసిన మ్యాచ్ చివరి బంతిని మ్యాజిక్ డెలివరీగా ఇప్పటికీ చెప్పుకుంటారు.
భారత విజయంలో అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ధోని కూడా కీలక భూమికలు పోషించారు. ఇషాంత్, జడ్డూ చెరో 4 ఓవర్లు వేసి తలో 2 వికెట్లు తీయగా.. ధోని రెండు కీలకమైన స్టంపౌట్లు, ఓ రనౌట్ చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఇయాన్ మోర్గన్ (33), రవి బొపారా (30), జోనాథన్ ట్రాట్ (20), ఇయాన్ బెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. కుక్ (2), రూట్ (7), బట్లర్ (0), బ్రేస్నెన్ (2) దారుణంగా విఫలమయ్యారు. ఈ గెలుపు అనంతరం భారత సంబురాలు అంబరాన్నంటాయి. ధోనితో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అప్పుడప్పుడే షైన్ అవుతున్న కోహ్లి ఈ విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు.
భారత క్రికెట్ అభిమానులకు ఈ విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. మినీ వరల్డ్‌కప్‌గా చెప్పుకునే ఈ టైటిల్‌ను గెలిచిన అనంతరం భారత్ 11 ఏళ్ల పాటు ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా సాధించలేకపోయింది. చివరికి 2024లో టీమిండియా కల సాకారమైంది. భారత్ 2024 టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈసారి రోహిత్ శర్మ టీమిండియాకు టైటిల్‌ను అందించాడు. భారత్ మొత్తంగా రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011), రెండు టీ20 ప్రపంచకప్‌లు (2007, 2024), రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు (2002, 2013) గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment