ఎంత లక్ష్యం సరిపోతుంది?
80లలో 200 పరుగులు, 90లలో 250, కొత్త మిలీనియంలో 300...వన్డే మ్యాచ్‌లో ఒక జట్టు ఈ స్కోరు సాధిస్తే గెలుపుపై ధీమాతో ఉండేది. కానీ ఇప్పుడు!!! ఎన్ని పరుగులు చేసినా గెలుస్తామనే విశ్వాసం జట్టు కెప్టెన్లలో కనిపించడం లేదు. పక్షం రోజుల వ్యవధిలో భారత్ రెండు సార్లు 350కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించిందంటే అది సాధారణ విషయం కాదు. టి20ల రాకతో బ్యాటింగ్‌లో వేగం పెరిగిందనే మాట వాస్తవమే అయినా...అది కొంత వరకే.
భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో బ్యాట్స్‌మెన్ వీర కొట్టుడు చూస్తే బౌలర్లపై నిజంగా జాలి కలుగుతుంది. స్పీడ్‌ను నమ్ముకున్న జాన్సన్ అయినా...స్పిన్‌తో పడగొట్టే అశ్విన్ అయినా...అందరూ ఇక్కడ సమానమే. బ్యాట్స్‌మెన్ దూకుడు ముందు తలవంచాల్సిందే. ఎక్కడ బంతి వేయాలో, ఎలా వైవిధ్యం చూపాలో తెలీని గందరగోళంలో బౌలర్లు నిస్సహాయంగా మారిపోతున్నారు.
ఇలాంటి స్థితిలో సత్తా ఉన్న బౌలర్లు కూడా బ్యాట్స్‌మెన్‌పై ఆధిక్యం ప్రదర్శించే మాట దేవుడెరుగు...కేవలం ‘బాల్‌బాయ్స్’గా మారిపోతున్నారు. నిజానికి క్రికెట్ ఇప్పుడు పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆటగా మారిపోయింది. కేవలం భారీ సిక్సర్లు, బౌండరీలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆటలో నిబంధనలు ఏకపక్షంగా మార్చేస్తున్నారు. భారత పిచ్‌లు ఈ రికార్డు విజయాల్లో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. బ్యాట్‌కు, బాల్‌కు మధ్య సమాన పోటీ అనే మాటే ఇప్పుడు మారిపోయింది. ‘స్పోర్టింగ్ పిచ్’ అనే పదం మచ్చుకు కూడా కనిపించడం లేదు.
ఇవేం నిబంధనలు...
కొత్త నిబంధనలతో మమ్మల్ని ఏం చేయదల్చుకున్నారు అని సిరీస్ ఆరంభంలోనే ధోని తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఇప్పుడు సరిగ్గా అతను భయపడినట్లే జరిగింది. ఈ సిరీస్‌లో రెండు జట్లు కలిపి నాలుగు మ్యాచ్‌ల్లో ఏకంగా 2565 పరుగులు చేశాయి. సర్కిల్ లోపల మరో ఫీల్డర్‌ను అదనంగా ఉంచాల్సి రావడంతో బౌలర్లు ఏమీ చేయలేక భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.
ఇప్పుడు బౌలర్లను కాకుండా నిబంధనలను తప్పు పట్టాల్సి వస్తోంది. అసలు ఎన్ని పరుగులు ఇస్తే బౌలర్ చెత్తగా బంతులు వేశాడో చెప్పలేకపోతున్నానని ధోని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇకపై క్రికెట్ నేర్చుకునే ప్రతీ ఒక్కరు బ్యాట్స్‌మన్ కావడానికే ఇష్టపడతాడు తప్ప...బౌలర్‌గా మారాలని అనుకోరేమో!
‘ఇరు జట్లలో ఎవరు చెత్త బౌలింగ్ వేశారో అర్థం కావడం లేదు. సర్కిల్ లోపల అదనపు ఫీల్డర్ ఉండటంతో బౌలర్ కొంచెం పక్కకు వేసినా బంతి బౌండరీ దాటుతోంది. బౌలర్లు చాలా నిరాశగా ఉన్నారు. ఇలా ఉంటే బౌలింగ్ చేయాల్సిన అవసరం ఏముందని వాళ్లు భావిస్తున్నారు. బౌలర్ల స్థానంలో మైదానంలో బౌలింగ్ మెషీన్ పెడితే చాలని వారికనిపిస్తోంది. 10 ఓవర్లలో 100 పరుగులు ఇవ్వడమా, 80 పరుగులా, 60 పరుగులా....ఎన్ని ఇస్తే బౌలర్ విఫలమైనట్లు భావించాలి’
- ఎం.ఎస్. ధోని, భారత కెప్టెన్