సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్ కోసం జరిగిన వేలంలో హెచ్‌ఎస్ ప్రణయ్ జాక్‌పాట్ కొట్టాడు. సీజన్–2లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా నిలవడంతో పాటు గత ఏడాది కాలంలో ఉత్తమ ప్రదర్శనతో వేగంగా దూసుకొచ్చిన ప్రణయ్‌ను కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ పెద్ద మొత్తంతో సొంతం చేసుకుంది. ప్రణయ్‌కు వేలంలో రూ. 62 లక్షలు దక్కాయి. గత సీజన్‌లో ప్రణయ్‌కు రూ. 25 లక్షలు మాత్రమే లభించాయి. ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా గత ఏడాది చెల్లించిన మొత్తానికి అదనంగా 25 శాతం ఇస్తూ స్టార్ ఆటగాళ్లను వివిధ జట్లు అట్టి పెట్టుకున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ రూ. 48.75 లక్షలకు సింధును, అవధ్ వారియర్స్ రూ. 41.25 లక్షలకు సైనా నెహ్వాల్‌ను కొనసాగించగా...పురుషుల టాప్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కోసం అవధ్ రూ. 56.10 లక్షలు వెచ్చించింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్ హంటర్స్ తమతోనే ఉంచుకుంది.
పురుషుల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్‌ను అతని పాత జట్టు బెంగళూరు బ్లాస్టర్స్ రూ. 50 లక్షలతో కొనసాగించగా...లీగ్‌లోకి తొలిసారి అడుగు పెట్టిన మహిళల వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్ కోసం కూడా కొత్త టీమ్ అహ్మదాబాద్ రూ. 52 లక్షలు చెల్లించింది. మరో సింగిల్స్ స్టార్ అజయ్ జయరామ్ కొత్త జట్టు నార్త్ ఈస్టర్స్ వారియర్స్‌కు (రూ.44 లక్షలు) వెళ్లాడు. గతంతో పోలిస్తే ఈ సారి అనూహ్యంగా డబుల్స్ స్పెషలిస్ట్‌లకు కూడా భారీ మొత్తం పలకడం మరో విశేషం. వేలంలో ప్రతీ జట్టు గరిష్టంగా పదేసి మంది షట్లర్లను ఎంచుకుంది. ఇందు కోసం నిర్దేశించిన రూ. 2.40 కోట్ల గరిష్ట మొత్తంలో అత్యధికంగా హైదరాబాద్ హంటర్స్ రూ. 2.39 కోట్లను ఖర్చు చేసింది. డిసెంబర్ 22నుంచి జనవరి 14 వరకు పీబీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం రూ. 6 కోట్ల ప్రైజ్‌మనీలో విజేతకు రూ. 3 కోట్లు లభిస్తాయి. సోమవారం జరిగిన వేలం కార్యక్రమంలో పీబీఎల్ డైరెక్టర్ ప్రసాద్ మంగినపూడి, ‘బాయ్’ కార్యదర్శి (టోర్నమెంట్స్) కేసీ పున్నయ్య చౌదరి, ఫ్రాంచైజీ యజమానులు పాల్గొన్నారు.
ప్రణయ్ పంట పండింది!
Published Tue, Oct 10 2017 1:00 AM | Last Updated on Tue, Oct 10 2017 1:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment