సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్‌లో ఇప్పటి వరకు హైదరాబాద్ హంటర్స్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. తొలి పోరులో చెన్నై సూపర్‌స్టార్స్ చేతిలో ఓడిన ఆ జట్టు ఆ తర్వాత అవధ్ వారియర్స్‌పై నెగ్గింది. అయితే ఓవరాల్ పాయింట్లపరంగా చూస్తే 4 పాయింట్లతో ప్రస్తుతం చివరి స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు సొంతగడ్డపై ఆ జట్టు తమ మిగిలిన మ్యాచ్‌లు ఆడనుంది. నేటి నుంచి హైదరాబాద్ అంచె లీగ్ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. నేటి మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో హంటర్స్ జట్టు ఆడుతుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల మద్దతుతో విజయాలు సాధించి లీగ్‌లో ముందంజ వేస్తామని హంటర్స్ టీమ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. మిగిలిన పీబీఎల్ మొత్తం హైదరాబాద్‌లోనే కొనసాగనుంది. ఫిబ్రవరి 6 వరకు గ్రూప్ దశ మ్యాచ్‌లు, 7, 8 తేదీల్లో సెమీఫైనల్, 9న ఫైనల్ ఇక్కడే జరుగుతాయి.
ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా...
సొంత వేదికపై హైదరాబాద్ హంటర్స్ మిగిలిన మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో మంగళవారం టీమ్ మేనేజ్‌మెంట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా టీమ్ స్టార్ షట్లర్, వరల్డ్ చాంపియన్ పీవీ సింధు మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన చిన్న చిన్న పొరపాట్లను అధిగమిస్తామని వ్యాఖ్యానించింది. ‘రెండు మ్యాచ్‌లలో కూడా మా ప్రయత్నంలో లోపం లేదు. 100 శాతం శ్రమించాం. అయితే కొంత దురదృష్టం వెంటాడింది. ఇకపై ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వం. ఏ రకంగా చూసినా సొంత మైదానంలో ప్రేక్షకుల మద్దతు మాలో ఉత్సాహం పెంచుతుంది.
అభిమానులు, సన్నిహితులు, మిత్రులు ఎంతో మంది మ్యాచ్‌లు చూడటానికి వస్తారు కాబట్టి ఆ వాతావరణం ప్రత్యేకంగా ఉంటుంది’ అని సింధు అభిప్రాయ పడింది. హైదరాబాద్‌కే చెందిన డబుల్స్ స్పెషలిస్ట్ నేలకుర్తి సిక్కి రెడ్డి కూడా హంటర్స్ తరఫునే బరిలోకి దిగుతోంది. ‘పీబీఎల్ ప్రారంభమైన నాటి నుంచి సొంత టీమ్ హైదరాబాద్ తరఫున ఆడాలనేది నా కల. అది నిజమైంది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే మ్యాచ్‌లు ఆడబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది’ అని పేర్కొంది. ఈ కార్యక్రమంలో హంటర్స్ జట్టు స్పాన్సర్స్ ‘అభీబస్’ ఎండీ సుధాకర్ రెడ్డి, ఓరియంట్ సిమెంట్స్ ప్రతినిధి మనీశ్ దువా తదితరులు పాల్గొన్నారు.
నష్టాలొచ్చినా సరే...
నాలుగేళ్లుగా పీబీఎల్‌లో కొనసాగుతున్నాం. ఒక్కసారి కూడా లీగ్ ద్వారా ఆర్థికపరమైన లాభాలు కళ్లచూడలేదు. విజేతగా నిలిచిన ఏడాది మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉండి బ్రేక్ ఈవెన్‌కు చేరువగా వచ్చాం. ఒక రకంగా నష్టమే తప్ప లాభం మాత్రం ఎప్పుడూ రాలేదు. అయితే మేం దీనికి సిద్ధం. ఆటపై అభిమానంతోనే ఇదంతా చేస్తున్నాం. ఎక్కడో అనసరమైన చోట పెట్టుబడి పెట్టే బదులు క్రీడల్లో ఉండటం మంచిది కదా.
–వీఆర్‌కే రావు, హైదరాబాద్ హంటర్స్ టీమ్ యజమాని
Comments
Please login to add a commentAdd a comment