హర్భజన్‌ను మెచ్చుకోవాల్సిందే: ఐసీసీ సీఈఓ
న్యూఢిల్లీ: నిబంధనలకు లోబడి బౌలింగ్ చేయని బౌలర్లపై ఐసీసీ విరుచుకుపడటంలో ఎటువంటి దురాలోచనలు లేవని ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్‌సన్ స్పష్టం చేశాడు. అయితే సస్పెన్షన్‌కు గురైన బౌలర్లు.. తమ యాక్షన్‌ను సరిచేసుకొని మళ్లీ మైదానంలో అడుగు పెట్టవచ్చని ఆయన తెలిపారు. ఈ విషయంలో భారత బౌలర్ హర్భజన్ సింగ్‌ను మెచ్చుకోవాలని ఆయన అన్నారు. ‘హర్భజన్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే బౌలింగ్‌ను మెరుగుపరచుకోవడంలో అతడు సఫలమయ్యాడు.
ప్రస్తుతం చాలా మంది బౌలర్లు నిబంధనల కంటే ఎక్కువగా మోచేతిని వంచుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలన్న ఐసీసీ నిర్ణయాన్ని క్రికెట్ కమిటీ కూడా సమర్థించింది. సస్పెండ్ అయిన బౌలర్లు వారి యాక్షన్‌ను సరిచేసుకోవాలని చూస్తున్నారు. చర్యల వల్ల నిబంధనలకు అనుగుణంగా బౌలింగ్ చేసే వారిని మాత్రమే జట్టులోకి తీసుకోవాలని గట్టి సంకేతాలు వెళ్లాయి’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు హర్భజన్ పాల్గొన్నారు. యాక్షన్ సరిగా లేని బౌలర్లను క్రికెట్ ఆడవద్దని ఐసీసీ చెప్పట్లేదని, బౌలింగ్ యాక్షన్‌ను సరిచేసుకొని మళ్లీ రావచ్చని హర్భజన్ తెలిపాడు.