హైదరాబాద్ కోచ్‌గా అజీమ్ | Hyderabad coach Azeem | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ కోచ్‌గా అజీమ్

Published Fri, Sep 12 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

హైదరాబాద్ కోచ్‌గా అజీమ్

హైదరాబాద్ కోచ్‌గా అజీమ్

- అర్జున్ యాదవ్‌కు అండర్-23 కోచ్ పదవి
- సీనియర్ చీఫ్ సెలక్టర్‌గా జ్యోతిప్రసాద్
సాక్షి, హైదరాబాద్:
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కొత్త కార్యవర్గం ఎన్నికైన నాలుగు రోజుల్లోపే తమ ‘ముద్ర’ చూపించింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పదవిలోకి రాగానే కమిటీలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. పాత కార్యవర్గం ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీలను రద్దు చేయడంతో పాటు కొత్తగా కోచ్‌లను కూడా నియమించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో గురువారం హెచ్‌సీఏ కొత్త కార్యవర్గం తొలి సమావేశం జరిగింది. అనంతరం సమావేశం వివరాలను హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ వెల్లడించారు. కార్యదర్శి జాన్ మనోజ్, ఉపాధ్యక్షులు ప్రకాశ్ చంద్ జైన్, సంయుక్త కార్యదర్శి విజయానంద్, కోశాధికారి దేవ్‌రాజ్ కూడా ఇందులో పాల్గొన్నారు.
 
రెండేళ్ల పదవీ కాలం: సెలక్షన్ కమిటీ, కోచ్‌లను రెండేళ్ల పదవీ కాలానికి ఎంపిక చేసినట్లు అర్షద్ అయూబ్ వెల్లడించారు. ఈ సీజన్ షెడ్యూల్ చాలా బిజీగా ఉందని, మధ్యలో కనీసం రెండు వారాల విరామం దొరికితే మొయినుద్దౌలా టోర్నీని నిర్వహిస్తామని, దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఇందులో పాల్గొనేలా చేయడమే తమ ఆలోచన అని అన్నారు.  
 
మెదక్‌లో తొలి అకాడమీ: జింఖానా మైదానంలో ఉన్న హెచ్‌సీఏ అకాడమీని కూడా ‘సెంట్రల్ అకాడమీ’గా మరింత అభివృద్ధి చేస్తామని అయూబ్ వివరించారు. దీనికి డెరైక్టర్‌గా ఉండాలని ఆర్.శ్రీధర్‌ను కోరామన్నారు. ఇప్పటికే ఆంధ్ర క్రికెట్‌తో ఒప్పందం చేసుకున్న శ్రీధర్, దానిని రద్దు చేసుకుంటే ఇక్కడ పని చేస్తారని తెలిపారు. జిల్లాల్లో సౌకర్యాల కల్పన హామీకి కట్టుబడి ఉన్నామన్న హెచ్‌సీఏ అధ్యక్షుడు... ముందుగా మెదక్‌లో తొలి అకాడమీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.  
 
బీసీసీఐని డబ్బులు అడిగాం: మరో వైపు హెచ్‌సీఏ ఖాతాలో ప్రస్తుతం రూ. కోటి లోపు మొత్తం మాత్రం ఉందని, ఇది భవిష్యత్తు కార్యకలాపాలకు ఏ మాత్రం సరిపోదని అయూబ్ అన్నారు. అయితే చాంపియన్స్ లీగ్ నిర్వహణ కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ.30 లక్షలు ఇవ్వాల్సిందిగా బీసీసీఐని కోరామన్నారు.
 
హైదరాబాద్  సీనియర్ సెలక్షన్ కమిటీ
జ్యోతి ప్రసాద్ (చైర్మన్), ఆర్‌ఏ స్వరూప్, ఎహ్‌తెషామ్, అరుణ్ పాల్

జూనియర్ సెలక్షన్ కమిటీ
 జ్యోతి శెట్టి (చైర్మన్), ఇమ్రాన్ మహమూద్, నాగరాజు, ఇఫ్తెఖారుద్దీన్

సబ్ జూనియర్ సెలక్షన్ కమిటీ
 అల్లాడి రాజు (చైర్మన్), వినోద్ మఖీజా, సాయిలక్ష్మణ్, ఎంఏ జావీద్.

హైదరాబాద్ కోచ్‌లు
 రంజీ ట్రోఫీ కోచ్: అబ్దుల్ అజీమ్, అసిస్టెంట్ కోచ్: నోయల్ డేవిడ్, ఫీల్డింగ్ కోచ్: గణేశ్
 అండర్-23 కోచ్: అర్జున్ యాదవ్, ఫీల్డింగ్ కోచ్: మొహమ్మద్ గౌస్
 అండర్-19 కోచ్: కిరణ్ కుమార్, ఫీల్డింగ్ కోచ్: దయానంద్
 అండర్-16 కోచ్: అనిరుధ్ సింగ్, ఫీల్డింగ్ కోచ్: అనిల్ మిట్టల్
 అండర్-14 కోచ్: రియాజ్ ఖురేషీ, ఫీల్డింగ్ కోచ్: రాజేశ్వర్.
 
కన్సల్టెంట్ ‘తరహా’ పాత్రలో లక్ష్మణ్
మరో వైపు హెచ్‌సీఏ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా మాజీ టెస్టు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా హాజరు కావడం విశేషం. హైదరాబాద్ క్రికెట్ మెరుగుదల గురించి లక్ష్మణ్ తగిన సూచనలిచ్చారని, భవిష్యత్తులో క్రికెట్ వ్యవహారాల్లో భాగస్వామి అయ్యేందుకు ఆసక్తి చూపించారని అయూబ్ వెల్లడించారు. అయితే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలకు వీవీఎస్ దూరంగా ఉంటారని, ఆయనకు అధికారిక హోదా ఏమీ ఇవ్వకున్నా కన్సల్టెంట్ తరహా పాత్ర పోషిస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement