CT 2025: టీమిండియా మేనేజర్‌గా హెచ్‌సీఏ కార్యదర్శి | CT 2025: HCA Secretary R Devraj Appointed As Team India Manager | Sakshi
Sakshi News home page

CT 2025: టీమిండియా మేనేజర్‌గా హెచ్‌సీఏ కార్యదర్శి

Published Mon, Jan 20 2025 12:08 PM | Last Updated on Mon, Jan 20 2025 12:30 PM

CT 2025: HCA Secretary R Devraj Appointed As Team India Manager

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) కార్యదర్శి ఆర్‌. దేవ్‌రాజ్‌ మేనేజర్‌గా ఎంపికయ్యారు. వచ్చే నెల 19 నుంచి జరగనున్న ఈ టోర్నీలో రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. పాకిస్తాన్‌ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్వహించనున్నారు.

ఇదో గొప్ప గౌరవం
‘టీమిండియాకు నన్ను మేనేజర్‌గా నియమించిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆఫీస్‌ బేరర్లకు ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించే అవకాశం హెచ్‌సీఏ అధికారికి లభించింది. 

ఇదో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని దేవ్‌రాజ్‌ అన్నారు. టీమిండియా మేనేజర్‌గా ఎంపికైన దేవ్‌రాజ్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావుతోపాటు ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. 

కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, అంతకంటే ముందు రోహిత్‌ సేన సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌ ఆడనుంది. 

ఇండియా- ఇంగ్లండ్‌ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు నిర్వహిస్తారు. తద్వారా మెగా టోర్నికి ముందు ఇరుజట్లకు కావాల్సినంత ప్రాక్టీస్‌ లభించనుంది.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌(వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా(ఫిట్‌నెస్‌ ఆధారంగా) మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌.
ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: వరుణ్‌ చక్రవర్తి, ఆవేశ్‌ ఖాన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి

చాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఇవే
గ్రూప్‌-‘ఎ’: ఇండియా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా
గ్రూప్‌-‘బి’: ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌

చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా షెడ్యూల్‌
ఫిబ్రవరి 20, 2025  (దుబాయ్)- ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్ 
ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌
మార్చి 2, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌

రజతం నెగ్గిన జ్యోతి సురేఖ 
సాక్షి, హైదరాబాద్‌: ఇండోర్‌ వరల్డ్‌ కప్‌ సిరీస్‌లో భాగంగా ఫ్రాన్స్‌లో జరిగిన నిమెస్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ వెన్నం జ్యోతి సురేఖ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 

ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 146–147తో అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ 600 పాయింట్లకుగాను 592 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement