సాక్షి, హైదరాబాద్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయం కోసం నేడు విదర్భ జట్టుతో తలపడనుంది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మరోవైపు విదర్భ కూడా రెండు వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉంది. సమఉజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లు ఆధిపత్యం కోసం ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. గ్రూప్ ‘డి’ లో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌లో సత్తా చాటుతోంది. రెండు మ్యాచ్‌ల్లో టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించారు. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో అక్షత్ రెడ్డి, జార్ఖండ్‌తో పోరులో రోహిత్ రాయుడు భారీ సెంచరీలతో చెలరేగారు. బావనక సందీప్, సుమంత్ కొల్లా అర్ధసెంచరీలతో ఫామ్‌లో ఉన్నారు.
ఆకాశ్ భండారి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన పేసర్ సిరాజ్ కూడా తన బౌలింగ్ పదును చూపిస్తున్నాడు. మరోవైపు ఇటీవలే రంజీ ట్రోఫీని గెలిచి ఊపు మీదున్న విదర్భ జట్టులో బౌలర్లు సమష్టిగా రాణిస్తున్నారు. రంజీలో సత్తా చాటిన బౌలర్ రజనీశ్ గుర్బానీ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. ఉమేశ్ యాదవ్, యశ్ ఠాకూర్ కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌లో జితేశ్ శర్మ, గణేశ్ సతీశ్, సంజయ్ రామస్వామి, అపూర్వ్ వాంఖడే నిలకడగా ఆడుతున్నారు. వీరిని నిలువరిస్తే హైదరాబాద్‌కు హ్యాట్రిక్ విజయం దక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment