చైతన్యరెడ్డిని రనౌట్ చేసిన అనంతరం విదర్భ ఆటగాళ్ల సంబరం
సాక్షి, హైదరాబాద్: విజయ్ హజారే వన్డే టోర్నీలో వరుసగా రెండు విజయాలు సాధించి జోరు మీదున్న హైదరాబాద్‌కు మూడో మ్యాచ్‌లో ఎదురు దెబ్బ తగిలింది. గురువారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో విదర్భ 237 పరుగుల భారీ తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా విదర్భ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేయగా... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ 34.2 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్ (97 బంతుల్లో 103; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీ సాధించగా... రవి జాంగిడ్ (62 బంతుల్లో 81; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అపూర్వ్ వాంఖడే (43 బంతుల్లో 66; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో రవితేజకు 2 వికెట్లు దక్కాయి.
అనంతరం హైదరాబాద్ ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్ రాయుడు (3), అక్షత్ రెడ్డి (6), సందీప్ (7), చైతన్యరెడ్డి (5) ఘోరంగా విఫలమయ్యారు. రెండు మ్యాచ్‌ల నిషేధం పూర్తయిన తర్వాత ఈ మ్యాచ్ బరిలోకి దిగిన కెప్టెన్ అంబటి రాయుడు (21) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ 43 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సుమంత్ కొల్లా (30; 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడినా... రవితేజ (7), భండారి (10), మెహదీ హసన్ (0), సిరాజ్ (10)ల వికెట్లు కోల్పోవడంతో లక్ష్యానికి చాలా దూరంలో హైదరాబాద్ ఆట ముగిసింది. విదర్భ బౌలర్లలో కరణ్ శర్మ మూడు, శ్రీకాంత్ వాఘ్ రెండు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment